బ్రేకింగ్; తెలంగాణా కాంగ్రెస్ బాస్ గా రేవంత్ రెడ్డి…?

ఝార్ఖండ్ ఎన్నికలు, ఉప ఎన్నికల ఫలితాల్లో సానుకూల వాతావరణం కనపడటంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. బిజెపి ప్రాభవం తగ్గే అవకాశాలు కనపడటంతో కాంగ్రెస్ ఇప్పుడు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. కేంద్ర పాలిత ప్రాంతాలు సహా 12 రాష్ట్రాల్లో కీలక బాధ్యతలను యువనేతలకు అప్పగించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఇన్నాళ్ళు పార్టీని పట్టుకుని వేలాడుతున్న సీనియర్ నేతలను పక్కన పెట్టి వారిని సలహాల కోసం మాత్రమే,

వాడుకునే విధంగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తుంది. ఎన్నికల్లో నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధి ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను సోనియా గాంధీ చేపట్టారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు సహా, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలు, బిహార్, ఉత్తరప్రదేశ్, కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీ, గోవాలో అధ్యక్షులను మార్చే యోచనలో ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో కార్యకర్తల బలం ఉండటం, వాళ్ళు మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డిని అధ్యక్షుడిగా కావాలని కోరుతున్న నేపధ్యంలో ఆయనకు బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్టానం ఉంది. ఇకపోతే కర్ణాటకలో దినేష్ గుండూ రావు ని తప్పించి ఆ బాధ్యతలను ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివ కుమార్ కి బాధ్యతలు అప్పగించే యోచనలో ఉంది. తమిళనాడు, కేరళలో కూడా మార్పులు చేసే అవకాశం ఉండగా, మళ్ళీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని నియమించే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

అదే విధంగా తెలంగాణాలో రేవంత్ రెడ్డికి మార్గం సుగుమం చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయం ముందే తెలిసిన ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ కుమార్ రెడ్డి తప్పించక ముందే తప్పుకునే ఆలోచనలో ఉన్నారట. ఆయన త్వరలో బిజెపి తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే సీనియర్లకు కూడా ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం చెప్పెసినట్టు తెలుస్తుంది. కేంద్రంలో బిజెపి బలహీనపడుతుందని, ఇప్పుడు మార్పులు అవసరమని చెప్పినట్టు తెలుస్తుంది. బుజ్జగింపులు కూడా ఉండవని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.