నిజానికి ‘ఉయ్యాలవాడ’.. హీరోనా? విలనా ?

-

పాలెగాళ్లు – స్వాతంత్య్రం రాకమునుపు బ్రిటిష్‌ పాలకులకు కప్పం కడుతూ, తమ సంస్థానాల పాలన కొనసాగించినవారు. రేనాటి పాలకుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కూడా అలాంటివాడే.

రూపనగుడి గ్రామం, ఉయ్యాలవాడ మండలం, కర్నూలు జిల్లా… ఇది నర్సింహారెడ్డి స్వగ్రామం. తాతల నాటినుండి పాలెగాళ్లుగా ఆ రేనాడు ప్రాంతాన్ని పాలిస్తుండేవాళ్లు. సహజంగానే ప్రజల నుండి కప్పం వసూలు చేస్తూ పాలన సాగిస్తుండేవారు. ఎప్పుడైతే బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ భారతదేశాన్ని ఆక్రమించుకుందో, అప్పటినుండి వీరికి కష్టాలు మొదలయ్యాయి.

ఈస్టిండియా కంపెనీ, ప్రజల వద్దనుండి నేరుగా పన్నులు వసూలు చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. దీన్నే ‘రైతువారీ’ పద్ధతంటారు. దాంతో ఈ పాలెగాళ్లకు ఎటువంటి ఆదాయం లేకపోవడంతో బ్రిటిష్‌ ప్రభుత్వంతో తమ పరిస్థితేంటని మొరపెట్టుకున్నారు. అప్పుడు వాళ్లు ఈ పాలెగాళ్లకు పింఛను ఏర్పాటు చేసింది. నెలకు ఇంతని చెప్పి ఇస్తూ, పన్ను వసూలు బాధ్యతను కూడా వారికే అప్పజెప్పారు. ఇది క్రమంగా వారికి కంటగింపుగా మారింది. మాకు చెందాల్సిన డబ్బు, మేమే వసూలు చేసి బ్రిటిష్‌వారికి అప్పజెప్పాలా… అని కడుపు మండింది. ఇంకోపక్క ఆదాయం సరిపోవడం లేదని బ్రిటిష్‌ వారు ప్రజల్ని ఇంకా పీడించడం మొదలుపెట్టారు. కారణమేదైనా నర్సింహారెడ్డిలాంటి పాలెగాళ్లకి, గ్రామపెద్దలకు ఇది నచ్చలేదు.

భూములు పోయి, పంటలను కూడా దక్కనివ్వకుండా చేస్తున్న బ్రిటిష్‌ కంపెనీపై ప్రజలకు పట్టరాని కోపం పెరిగింది. వారంతా నర్సింహారెడ్డి శరణుజొచ్చారు. అప్పటికే తనకు పింఛను ఆపేసిన కోపంతో ఉన్న నర్సింహారెడ్డి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. 1846లో తాడిత-పీడిత వర్గాలతో సైన్యం ఏర్పాటు చేసుకుని, బ్రిటిష్‌వారిపై తిరగబడ్డాడు. కోయిలకుంట్లలోని బ్రిటిష్‌ క్యాంప్‌పై దాడిచేసి, కోశాగారాన్ని లూటీ చేసాడు. కొంతమంది అధికారులను కూడా అంతమొందించాడు. ఐదువేల మంది సాయుధులతో బ్రిటిష్‌ సేనను ఎదిరించిన రెడ్డి, భారీ యుద్ధమే చేసాడు. ఈ క్రమంలో కొంతమంది రెడ్డి సైనికులను చంపిన బ్రిటిష్‌ కంపెనీ మరికొందరు విప్లవకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. నర్సింహారెడ్డి కొంతమంది ముఖ్యఅనుచరులతో నల్లమల కొండలలోకి వెళ్లిపోయాడు. అతని కుటుంబాన్ని కూడా అరెస్టు చేసి, ఆచూకీ కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ఆ తర్వాత కొంతకాలానికి నర్సింహారెడ్డితో సహా మిగిలిన విప్లవకారులు పోలీసులకు చిక్కారు. కొంతమందిని బెయిల్‌పై, మరికొంతమందిని కేసులేవీ లేకుండా విడిచిపెట్టారు. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డికి మాత్రం మరణదండన విధించారు.

22 ఫిబ్రవరి 1847న కోయిలకుంట్లలో దాదాపు రెండువేలమంది సమక్షంలో నర్సింహారెడ్డిని ఉరితీసారు. తర్వాత అతని తలను కోటగుమ్మానికి వేలాడదీసారు. జనం చూసి ఎదిరించాలంటే భయపడడానికి వీలుగా ఆ తల 1877 వరకు దాదాపు ముప్పయ్యేళ్లపాటు అక్కడ వేలాడింది.

అయితే, ఇక్కడ జరిగింది భారత స్వాతంత్య్ర సంగ్రామం కాదు. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు అసలే కాదు. కేవలం డబ్బు, అధికారం కోసం మొదలెట్టిన యుద్ధం కొంతమేరకు ప్రజల పక్షాన సాగింది కానీ, భరతమాత దాస్యశృంఖలాలను తెంపడంకోసం మాత్రం కాదు. తనకోసం బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం మాత్రమే. అది ఉయ్యాలవాడ స్వంత సమరం. నర్సింహారెడ్డి కూడా అధికారాన్ని కులాసాగా అనుభవించినవాడే. ముగ్గురు భార్యలు, ఒక ప్రేయసితో రంగరంగ వైభోగం అనుభవించినట్లు చరిత్ర చెబుతోంది. ప్రజలను పీడించి వసూలు చేసిన డబ్బులు తననుభవించకుండా వాడెవడికో కట్టబెట్టడం నచ్చలేదు.. అంతే. ఆరకంగా చూస్తే, తన ప్రజల కష్టాన్ని తనూ దోచుకున్నాడు కాబట్టి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి హీరో అయితే కాదు. మరి విలనా..? ఎవరికోసం చేసినా, పోరాటం ప్రజలపక్షాన ఉండటం ఆయనకు కొంతమేరకు కలిసొచ్చింది. అదే ఆయనను నాయకుడిని చేసింది.

ఆ నాయకుడిని కథానాయకుడిని చేసింది ‘సైరా’.. ఇది బయోపిక్‌ కాదని దర్శకుడు తప్పించుకున్నా, కుదరలేదు. సినిమా స్వేచ్ఛను విచ్చలవిడిగా వాడుకున్నా, కమర్షియల్‌ హంగులన్నీ జోడించినా.. సరిగ్గా అమరలేదు. ఎందుకంటే ఇది ‘బాహుబలి’లా కాల్పనిక కథ కాదు. ముందే నిర్ణయించబడిన ఓ చట్రంలో ఉన్న జీవితగాథ. నేల విడిచి సాము చేయడం అస్సలు కుదరదు. అదే జరిగింది. సాంకేతికంగా ‘సైరా..’ అద్భుతంగా ఉన్నా, జరిగిన కథను పక్కదోవ పట్టించడం ఎప్పటికీ కరెక్ట్‌ కాదు.

– రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news