టీడీపీ అధికారంలో ఉంటే హడావిడి… అపోజిషన్లో ఉంటే అడ్రెస్ ఉండరు…!

-

ఇటీవల ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మునుపెన్నడూ లేని విధంగా దారుణ పరాజయం మూటగట్టుకున్నవిషయం తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా 175 సీట్లకి గాను ఆ పార్టీ కేవలం 23 సీట్లకి పరిమితమైంది. అలాగే మూడు ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఇంతటి దారుణ పార్టీ ఓటమి తర్వాత చాలామంది సైలెంట్ అయిపోయారు. అక్కడక్కడ కొందరు నేతలు మాత్రం పార్టీకి అండగా ఉండాలని బయటకొచ్చి మాట్లాడుతున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు కావలసిన పదవులు అనుభవించి, కొన్నిసార్లు అధినేత మాటని సైతం లెక్క చేయకుండా, నియోజకవర్గాల్లో తమ మాటే నేగ్గెలా చేసుకున్న నేతలు ఇప్పుడు అడ్రెస్ లేరు.

ముఖ్యంగా టీడీపీ ఓన్ చేసుకున్న సామాజికవర్గానికి చెందిన పార్టీ అనే ముద్ర తెచ్చేలా చేసిన కమ్మ నేతలు అయితే, పార్టీతో మాకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నా…వీరు బయటకొచ్చి నోరు విప్పే పరిస్థితిలో లేకుండా పోయారు. అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేసి, అపోజిషన్ లోకి రాగానే అందుబాటులో లేరు. కనీసం అధికార వైసీపీ చేస్తున్న విమర్శలని తిప్పేకోట్టేందుకు కూడా వీరికి మనసు ఒప్పనట్లు కనిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉంటే అధినేత చుట్టూ చేరి భజన చేసి, పదవులు సంపాదించి, అనుభవించిన వారు, ఇప్పుడు పార్టీని బలోపేతం చేద్దాం అన్న ఆలోచన లేకుండా ఉన్నారు.

ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లా నేతలు పార్టీకి అండగా ఉండటంలో పూర్తిగా విఫలమయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ, ఇంకా డ్యామేజ్ చేస్తున్నారు. ఇక దేవినేని ఉమా పరిస్తితి చెప్పక్కర్లేదు. ఎప్పుడు జిల్లాలో ఆధిపత్య పోరుకి ఈయనే కారణమవుతున్నారు. ఈయన వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో గద్దె రామ్మోహన్ పార్టీకి సపోర్ట్ గా బాగానే ఉంటున్నారు. కానీ వల్లభనేని వంశీ మాత్రం అంటిముట్టనట్లుగానే ఉన్నారు. ఇక పెన‌మ‌లూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు.

అటు గుంటూరు జిల్లా క‌మ్మ నాయకులు అయితే మరి దారుణం. అధికారంలో ఉన్నప్పుడు అంతా నాదే అన్నట్లుగా వ్యవహరించిన యరపతినేని శ్రీనివాసరావు, జి‌వి ఆంజనేయులు పెద్దగా పార్టీ కోసం బయటకొచ్చి మాట్లాడిన సంఘటనలు లేవు. జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా జీవి.ఆంజ‌నేయులు కొంత‌లో కొంత న‌యం. ఇక పొన్నూరు నుంచి వరుసగా ఐదు సార్లు గెలిచి, ఆరోసారి పోటీ చేసి ఓటమి పాలైన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ అడ్రెస్ లేరు. చిలకలూరిపేట నుంచి ఓడిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎక్కడ కనపడటం లేదు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్…ఆయన దారిలో ఆయన ఉన్నాడు. గల్లా అరుణకుమారి కూడా పార్టీ సమావేశాల్లోనే కనిపిస్తున్నారు. ఇక ఓటమి తర్వాత బయటకొచ్చి కొన్ని రోజుల మాట్లాడిన ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఇప్పుడు సైలెంట్ అయ్యారు.

TDP activists demands Chandrababu to remove Kodela Siva Prasad
TDP activists demands Chandrababu to remove Kodela Siva Prasad

ఇక పశ్చిమ గొదావరిలొ ఫైర్ బ్రాండ్ గా గుర్తిపు పొందిన చింతమనేని ప్రభాకర్ లో ఫైర్ తగ్గిపోయింది. అసలు ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు అయితే కంటికి కనపడట్లేదు. తణుకు మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. అయితే ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు పార్టీలో యాక్టివ్ గా ఉండగా, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సైలెంట్ గా ఉన్నారు. అలాగే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పార్టీ కోసం బాగానే కష్టపడుతున్నారు. అయితే విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన బాలయ్య చిన్నల్లుడు భరత్ అడ్రెస్ లేరు.

అటు సీమలో పేరున్న పరిటాల కుటుంబం ఓటమి తర్వాత అంత యాక్టివ్ గా కనపడట్లేదు. అలాగే అనంతపురం సిటీ నుంచి ఓడిన ప్రభాకర్ చౌదరి కూడా పార్టీకి దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పార్టీకి సపోర్ట్ గానే ఉన్నారు. అటు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య గురించి తెలిసిందే. ఒకవైపు సినిమా, మరోవైపు బసవతారకం హాస్పిటల్ చూసుకుంటూ…పార్టీ ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

మొత్తం మీద అధికారంలో ఉన్నప్పుడు పార్టీ మాదే అనే చెప్పుకునే కమ్మ సామాజికవర్గ నేతలు….అపోజిషన్ లోకి రాగానే పార్టీకి అండగా లేకుండా పోతున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో యాక్టివ్ అయ్యి పార్టీ కోసం ఏమన్నా కష్టపడతారేమో.!

Read more RELATED
Recommended to you

Latest news