Exclusive: పరాజయభారమే ప్రాణాలు తీసింది..!

-

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు పరాజయభారమే కారణమని తెలిసింది. అత్యంత విషాదకరంగా జీవితాన్ని ముగించిన పిల్లల జవాబు పత్రాలను తిరిగి రీవెరిఫికేషన్‌ చేసిన ఇంటర్‌మీడియట్‌ బోర్డు మొదట వెల్లడించిన ఫలితాలకు, రీవెరిఫికేషన్‌ తర్వాతి ఫలితాలకు పెద్ద తేడాలేదని, దురదృష్టవశాత్తు ప్రాణాలు తీసుకున్న విద్యార్థులెవరూ ఉత్తీర్ణులు కాలేదని ప్రభుత్వానికి తెలియజేసిందని విశ్వసనీయ సమాచారం.

తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేకపోయినందుకు 22 మంది విద్యార్థులు, ఫలితాల వెల్లడి తర్వాత, తల్లిదండ్రులను పుత్రశోకానికి గురిచేస్తూ, ప్రాణాలు తీసుకున్నారు. ఇంకో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.

the burden of failure took the lives of inter students in telangana

తదనంతర పరిణామాలలో ఫలితాలు తప్పుగా వెల్లడి కావడం, పెద్దఎత్తున గొడవలు, రాష్ట్రవ్యాప్త నిరసనలతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఒక త్రిసభ్యకమిటీకి బాధ్యతలు అప్పగించి, నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది. ఈలోగా దిద్దుబాటు చర్యలు తీసుకున్న ప్రభుత్వం, ఫెయిలైన విద్యార్థులందరి జవాబుపత్రాలు రీవెరిఫికేషన్‌ చేయాల్సిందిగా బోర్డును ఆదేశించింది. రీవెరిఫికేషన్‌ ఫీజును కూడా రద్దు చేసింది. బోర్డులో జరుగుతున్న అవకతవకలపై అంతర్గత విచారణను మొదలుపెట్టింది. హైకోర్టు కూడా రీవెరిఫికేషన్‌ ప్రక్రియను సాధ్యమైనంత తొందరలో పూర్తిచేసి, నివేదికను తమముందుంచాల్సిందిగా ఇంటర్‌ బోర్డుకు తాఖీదులు పంపింది.

ఈలోగా ఈ సమస్య రాజకీయరంగు పులుముకుని, ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు చేపట్టాయి. చనిపోయిన విద్యార్థులందరూ తప్పుడు ఫలితాల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని తీవ్రపదజాలంతో ప్రభుత్వాన్ని దూషించడం మొదలుపెట్టాయి. దీనికి తోడు, పక్క రాష్ట్ర రాజకీయ నాయకులు, సినీనటులు కూడా విషయం తెలుసుకోకుండా విమర్శించారు. దాంతో రీవెరిఫికేషన్‌ ప్రక్రియలో భాగంగా దురదృష్టవశాత్తు చనిపోయిన విద్యార్థుల జవాబు పత్రాలను పరిశీలించగా, ఒకరు మినహా ఎవరూ పాస్‌ కాలేదని తెలిసింది. ఆ ఒక్కరికి మొదటి ఫలితం కూడా పాస్‌ అనే వచ్చింది. అయితే ఆ ఆమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అంతుపట్టడంలేదు. ఇంకో అమ్మాయి కూడా పాస్ కాగా, తను ఆత్మహత్యాయత్నం నుండి ప్రాణాలతో బయటపడింది. ఇక్కడ కూడా అమ్మాయి ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసిందో తెలియదు.

మొత్తం 22 మంది విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకోగా, ముగ్గురు మాత్రం అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ 25 మంది ఫెయిలయిన 53 జవాబు పత్రాలను తనిఖీ చేయగా, కొందరికి కేవలం 1, 2, 4, 5 మార్కులు అదనంగా వచ్చాయి. ఇవి వాళ్లు పాస్‌ కావడానికి సరిపోకపోవడంతో ఫెయిల్డ్‌గానే మిగిలిపోయారు. అయితే ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యం వల్ల ఫలితాలలో తప్పులు దొర్లడంతో, వీరు కూడా తప్పుడు ఫలితాల వల్లే ప్రాణాలు తీసుకున్నారన్న అపప్రథ ప్రభుత్వం మోయవలసివచ్చింది. కానీ, ఈ తప్పులతో, వీరి ఫలితాలు ప్రభావితం కాలేదని రీవెరిఫికేషన్‌ ద్వారా తెలిసిందని స్వతంత్రంగా ఫలితాలను ప్రాసెస్‌ చేస్తున్న సంస్థ అధికారి ఒకరు తెలిపారు. ఏదేమైనా పరీక్షల్లో ఫెయిలయినందుకు పిల్లలు ప్రాణాలు తీసుకోవడం ఆ తల్లిదండ్రులకు, సమాజానికి తీరని లోటు. ఎంతో భవిష్యత్తున్న పిల్లలు, కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడతారని ఆశిస్తున్న సమయంలో అకాలమృత్యువు కబళించడం నిజంగా చాలా బాధాకరం.

Read more RELATED
Recommended to you

Latest news