యూసీసీతో భారతావనికి లాభమే

-

భిన్నత్వంలో ఏకత్వం… భారతదేశం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే అందరూ చెప్పే వాక్యం ఇది. అనేక సంప్రదాయాలు కలిగిన ఈ దేశంలో ఉమ్మడి పౌరస్మృతి చట్టం అనేది ఎన్నో ఏళ్లుగా వినపడుతోంది. అసలు ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాల్సిన అవసరం ఉందా…? ఒక వేళ అమల్లోకి తెస్తే దాని వల్ల లాభమా..? నష్టమా..? భారత్ లో ఇలాంటి చట్టం అమలు అసలు సాధ్యమవుతుందా..? సాధ్యమయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే మోడీకి ఉన్న గొప్ప లక్షణం.

మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా ఒక దేశంలో ఉన్న పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయడమే యూనిఫాం సివిల్‌ కోడ్‌ లక్ష్యం.అసలు మన దేశంలో పెళ్లిళ్లు, వారసత్వంగా వచ్చే ఆస్తులు, పిల్లలను దత్తత తీసుకోవడం, జీవనభృతి లాంటి విషయాలకు సంబంధించిన చట్టాలు అందరికీ ఒకేలా లేవు. ఆచరిస్తున్న మతం, విశ్వాసాలను బట్టి చట్టంలో నియమాలు మారిపోతున్నాయి.మతం, లింగం తో సంబంధం లేకుండా భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తింపజేయడం యూనిఫాం సివిల్ కోడ్ ప్రధాన ఉద్దేశం. యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని 44వ ఆర్టికల్ ప్రకారo చర్యలు తీసుకోవాలని ఆదేశిక సూత్రాల రూపంలో రాజ్యాంగం కూడా సూచిస్తోంది.అలాగే భారత రాజ్యాంగంలోని 25వ అధికరణంలో ఉమ్మడి పౌర స్మృతిని విబేధించే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి.మరి ఇలాంటి పరిస్తితుల్లో యూసీసీ సాధ్యమవుతుందా….?

భారత దేశంలో అనేక చట్టాలున్నాయి.ఆచరణలో ఉన్న మతాలను అనుసరించి భిన్నమైన పర్సనల్‌ చట్టాలు కూడా ఉన్నాయి. హిందూ ధర్మంలో వివాహ, వారసత్వ చట్టాలు ఉండగా ముస్లింలకు షరియా వంటి పర్సనల్ చట్టాలు కూడా మన దేశంలో అమలవున్నాయి.అంటే మనదేశంలో విభిన్న రకాల చట్టాలు ఏకకాలంలో అమలు చేయబడుతున్నాయి. ఒకవేళ ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే ఎవరికి వారు పర్సనల్ చట్టాలను అమలుచేసుకునే వెసులుబాటు ఉండదు. అంటే యూసీసీ అమల్లోకి వస్తే ఇప్పుడున్న కుల, మతపరమైన చట్టాలు చెల్లుబాటు కావు.అందుచేతనే ఈ ఉమ్మడి పౌరస్మృతిని కొన్నివర్గాల వారు వ్యతిరేకిస్తున్నారు.

అప్పుడప్పుడు తెరమీదకు వస్తున్న ఈ అంశం…ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో యూసీసీ బిల్లు ఆమోదం పొందడంతో మళ్లీ ఉమ్మడి పౌరస్మృతి అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

అసలు ముందునుంచీ ఉమ్మడి పౌరస్మృతిని ముస్లిములే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు. వారు ఫాలో అవుతున్న షరియా చట్టాలకు కౌంటర్‌గానే యూనిఫాం సివిల్ కోడ్ తెస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షరియా చట్టాలు అనాగరికంగా ఉన్నాయనేదే మరికొందరి వాదన. అందులోని భార్యలకు విడాకులిచ్చే ట్రిపుల్ తలాఖ్‌ను వారు ఉదాహరణగా చూపుతున్నారు.

2019లో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఈ ట్రిపుల్ తలాక్ విధానాన్ని నేరంగా మారుస్తూ చట్టం కూడా తీసుకొచ్చింది.దీనిపై అప్పట్లో చాలామంది ముస్లిం మహిళలు హర్షం వ్యక్తపరిచారు. ప్రధాని మోడీకి ముస్లింలలో సానుకూల వాతావరణం ఏర్పడటానికి ఇది ఒక కారణమైంది. దీనిని ఆధారంగా చేసుకుని బీజేపీ ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేస్తూ ఉమ్మడి పౌర స్మృతిపై స్వరం పెంచింది.

నచ్చిన మతాన్ని స్వీకరించేందుకు,అనుసరించేందుకు, ఆ మతాన్ని వ్యాప్తి చేసేందుకు ఆర్టికల్‌ 25 సహకరిస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే మతపరమైన స్వేచ్ఛ విషయంలో ఎలాంటి మార్పులుండవు. భిన్న మతాలు, నమ్మకాలున్న భారత్ లాంటి అతిపెద్ద దేశాల్లో సివిల్ కోడ్స్ ద్వారా అందరినీ ఏకం చేయడమనేది చాలా చాలా కష్టమైన అంశం. 140 కోట్ల జనాభాను ఒకతాటిపైకి తీసుకురావడం అంతగా సాధ్యమయ్యేది కాదు.కానీ బీజేపీ సర్కారు యూసీసీపై పట్టు విడవడం లేదు. ఉమ్మడి పౌరస్మృతితో కులం, మతం, వర్గం, స్త్రీ, పురుష లింగ భేదాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది అని చెప్తోంది.

భారత దేశంలో అత్యధిక మంది హిందువులు ఉన్నారు. ముస్లిములు కూడా మైనార్టీ వర్గాలుగా ఉన్నారు. ఈ మతాలలో భిన్నమైన నమ్మకాలు, విశ్వాసాలు కొనసాగుతున్నాయి. హిందువుల్లోనే భిన్న ఆచారాలు, సంప్రదాయాలు పాటించే వాళ్లున్నారు.షరియా చట్టాన్ని ముస్లిములు అనుసరిస్తున్నా దానిని వ్యతిరేకించే వారు కూడా వారిలో ఉన్నారు. ఆస్తుల వారసత్వం విషయంలో హిందువుల చట్టాలను బోరా ముస్లింలు అనుసరిస్తుంటారు. ఆస్తుల వారసత్వం విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన చట్టాలను అమలు చేస్తున్న ఘనత కూడా మన దేశానిదే. క్రైస్తవులు మెజారిటీగా ఉండే నాగాలాండ్, మిజోరం లాంటి రాష్ట్రాల్లో ప్రత్యేకమైన సివిల్ చట్టాలు అమలవుతున్నాయ్. అక్కడి సంప్రదాయాలను బట్టి చట్టాలు వచ్చాయే కానీ వాటికి మతం ఆధారం కాదని ఆ రాష్ట్రాల ప్రజలు చెప్తున్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news