కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మొదట ఒడిశా.. ఆ తరువాత తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు లాక్డౌన్ను ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇక ఇతర రాష్ట్రాలు కూడా లాక్డౌన్ను పొడిగించాలని భావిస్తున్నాయి. అయితే తెలంగాణలో ఇప్పటికే ఇంటర్ పరీక్షలు పూర్తి కాగా.. పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. పలు ఇతర రాష్ట్రాల్లోనూ బోర్డు పరీక్షలను ఇప్పటికే వాయిదా వేశారు. అయితే లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ బోర్డు పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది ఆయా రాష్ట్రాలు వెల్లడించలేదు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ఇప్పటికే వెల్లడించారు. ఈ క్రమంలో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి..? అసలు వాటిని నిర్వహిస్తారా..? లేదా..? ఒక వేళ పరీక్షల నిర్వహణ ఆలస్యం అయితే.. ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి..? అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రకంగా లేదు. అయినప్పటికీ జూన్ వరకు అన్ని రాష్ట్రాల్లోనూ ఆ వైరస్ ప్రభావం చాలా వరకు తగ్గవచ్చని ఇప్పటికే నిపుణులు అంచనా వేసి చెబుతున్నారు. అయితే అదే గనక జరిగితే.. మే చివరి వారంలో లేదా.. జూన్ మొదటి వారంలో విద్యార్థులకు బోర్డు పరీక్షలను యథావిధిగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక కరోనా ప్రభావం తక్కువగా ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కొన్ని రోజులు ముందుగా.. అంటే.. మే మూడవ లేదా 4వ వారంలో పరీక్షలు నిర్వహిస్తారని తెలుస్తోంది. అయితే పరీక్షలను నిర్వహించాల్సి వస్తే.. అవి ఎలాగూ ఆలస్యం అవుతాయి కాబట్టి.. ఆ తరువాత పర్యవసానాలు ఎలా ఉంటాయనే.. ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు.
విద్యార్థులకు బోర్డు పరీక్షలను నిర్వహించడం ఎలాగూ ఆలస్యం అవుతుంది కనుక.. వారికి తరువాతి తరగతుల్లో ప్రవేశానికి ప్రక్రియ కూడా ఆలస్యంగా జరుగుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది విద్యాసంవత్సరం 1 లేదా 2 నెలలు ఆలస్యంగా ప్రారంభమవుతుందని సమాచారం. అయితే అలా జరిగినా.. విద్యార్థులకు పెద్దగా నష్టం ఉండదు.. కానీ అంతకు మించి ఆలస్యం అయితే మాత్రం.. వారు విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అలాంటి స్థితి వస్తే.. ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకుంటాయనేది.. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. మరి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయో తెలియాలంటే.. మరికొద్ది రోజుల వరకు వేచి చూడక తప్పదు..!