మొత్తానికి ప్రపంచకప్ సెమీస్‌లో స్థానాలు ఫిక్సయ్యాయి, అయితే ఎవరు ఎవరితో అనేది నేడు తేలిపోనుంది. 3వ, 4వ స్థానాల్లో ఇంగ్లండ్, న్యూజీలాండ్ ఖరారు కాగా, ఒకటి, రెండవ స్థానాలు ఎవరివో ఈరోజు జరిగే రెండు మ్యాచ్‌లు నిర్ణయించనున్నాయి.
ఎట్టకేలకు ప్రపంచకప్ క్రికెట్ పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. ఆరు జట్లు ఇంటిముఖం పట్టగా, నాలుగు జట్లు సెమీఫైనల్‌లో ప్రవేశించాయి. అందరూ ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్లు సెమీస్ పోరుకు సిద్ధమయ్యాయి. కానీ ఎవరు ఎవరితో సెమీస్ ఆడాలో ఇంకా సందిగ్ధంలోనే ఉంది. అది కూడా నేడు జరిగే భారత్-శ్రీలంక, ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లతో తేలిపోనుంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్ 13 పాయింట్లతో ద్వితీయస్థానంలో ఉంది. నిజానికి రెండు జట్లు ఎనిమిదేసి మ్యాచ్‌లాడి, ఒకటి ఓడిపోయి ఉన్నాయి. భారత్ ఖర్మకాలి, న్యూజీలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ కాస్తా వరుణుడు తన్నుకుపోవడంతో ఒక్క పాయింట్‌తో సర్దుకోవాల్సివచ్చింది. ఆ ఒక్క పాయింటే ఇప్పుడు ఇండియాకు చేదుగుళికయింది. లేకపోతే న్యూజీలాండ్‌పై గెలిచి 14 పాయింట్లతో హాయిగా టాప్ పొజిషన్‌లో ఉండేది.
ఇప్పుడు వచ్చిన చిక్కల్లా, ఫైనల్‌కు చేరుకోవడం ఎలా?… ఈరోజు ఇండియా, శ్రీలంకపై గెలిచి, ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాపై గెలిస్తే, స్థానాల్లో ఎటువంటి మార్పూ ఉండదు. 16 పాయింట్లతో ఆసీస్, 15తో భారత్ 1,2 స్థానాల్లో ఉంటాయి. అప్పుడు సెమీస్‌లో ఆస్ట్రేలియా న్యూజీలాండ్‌తో, భారత్ ఇంగ్లండ్‌తో తలపడతాయి. అలాకాకుండా, ఆసీస్ ఒకవేళ సౌతాఫ్రికా చేతిలో ఓడిపోతే, అప్పుడు లంకపై గెలిచిన ఇండియా నెంబర్ వన్‌కు చేరుకుంటుంది. తద్వారా సెమీస్‌లో న్యూజీలాండ్‌తో పోరాడుతుంది. ఇదొక్కటే సెమీస్‌లో ప్రత్యర్థులు మారడానికి ఉన్న అవకాశం. ఇది కాక ఏం జరిగినా, ఇండియా వర్సెస్ ఇంగ్లండే.
అద్భుతం ఏదైనా జరిగి, దక్షిణాఫ్రికా చేతిలో ఆసీస్ ఓడిపోవాలని భారత అభిమానులు పూజలు చేస్తున్నారు. అలా అయితేనే భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ నుంచి తప్పించుకుని, ఫైనలోకి అడుగుపెట్టొచ్చని వారి ఆశ. లేకపోతే సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఎదుర్కొని గెలవడం చాలా కష్టమని చాలామంది అభిప్రాయం. అయితే అన్నిరోజులు ఒకలా ఉండవు. శ్రీలంక, పాకిస్థాన్‌లు ఇదే ఇంగ్లండ్‌కు పగలే చుక్కలు చూపించాయనే విషయం కూడా మరువరాదు. లీగ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా భారత్ చివరిదాకా నిజానికి గెలిచే పరిస్థితిలోనే ఉంది. కాబట్టి ఇంగ్లండ్ అజేయజట్టేమీ కాదు. ఎవరు ప్రత్యర్థులైనా, భారత్ తన శక్తిసామర్థ్యాలను పూర్తిగా ప్రదర్శిస్తే, అందరూ బలాదూర్.