తప్పు తండ్రిదా…? కూతురుదా…?

ప్రేమించడం అనేది తప్పు కాదు, మనసుకి నచ్చిన మనిషిని కోరుకున్న మనిషిని ప్రేమించడంలో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాని ప్రేమించే ముందు కొన్ని కొన్ని ఆలోచించాలి. కులాలు, మతాలు పక్కన పెడితే తల్లి తండ్రుల ఆశయాలు, ఆశలు, కోరికలు ఎన్నో ఉంటాయి. కొడుకుల మీద కూతుళ్ళ మీద ఆశలు పెట్టుకుంటారు తల్లి తండ్రులు. పిల్లలు వాటిని అర్ధం చేసుకుని మెలగాల్సిన అవసరం ఉంది.

మరి మారుతీ రావు విషయంలో ఎం జరిగింది. అమృత… తనతో పాటు చదువుకున్న వాడిని ప్రేమించింది వివాహం చేసుకుంది. ఎప్పుడో తొమ్మిదవ తరగతి నుంచి ప్రేమ వ్యవహారం ఉంది. ఒకే కులం కాదు, కాని అతనితో కలిసి బ్రతకాలి అనుకుంది. నమ్మింది, తండ్రి వద్దన్నా వినలేదు. ప్రేమ కావాలనుకుంది వెళ్ళింది వివాహం చేసుకుంది, కాని ఇక్కడ అమృత కొన్ని కొన్ని ఆలోచించలేదు. బహుశా ఆలోచించే ప్రయత్నం కూడా చేసి ఉండకపోవచ్చు.

ప్రణయ్ మరణం తర్వాత ఆమె మాట్లాడిన కొన్ని మాటలు బాధ్యతారాహిత్యంగానే ఉన్నాయి. తల్లి తండ్రులు ఎంజాయ్ చేస్తే పిల్లలు పుడతారు అని మాట్లాడింది. పిల్లల కోసం ప్రాణం పెట్టుకున్న తల్లి తండ్రులు, భార్యతో కలిసి ఉండలేని భర్త… భర్తతో కలిసి ఉండలేని భార్య పిల్లల కోసం మాత్రం సంసారాలు చేస్తారు. సమాజంలో మన కళ్ళ ముందు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం చూసి చూడనట్టు వదిలేస్తాం.

పిల్లలు అనేది తల్లి తండ్రులకు ఒక బాధ్యత, ఒక బరువు, ఒక ప్రేమ, ఒక గౌరవం, ఒక జీవిత౦, ఒక ఆశయం. ఈ భూమి మీద ఎక్కడ చూసినా వందకు 95 మంది తల్లి తండ్రులు పిల్లల కోసమే బ్రతుకుతారు. ప్రపంచం సంగతి ఏమో గాని మన దేశంలో మాత్రం ఇంతే. కన్న కూతురు ఆత్మహత్య చేసుకుంటే చనిపోయే తల్లి తండ్రులు ఉన్నారు. కొడుకుల కోసం జీవితాలు త్యాగం చేసిన తల్లి తండ్రులు ఉన్నారు.

మారుతీ రావుకి ఉన్నదీ ఒక్కటే కూతురు. వంద కోట్ల ఆస్తిపరుడు. నీతులు, సూత్రాలు, సూక్తులు పక్కన పెడితే ప్రతీ తండ్రి ఆలోచించిన విధంగానే అతను కూడా ఆలోచిస్తాడు. తన కూతురు గురించి అతనికి కొన్ని కోరికలు ఉంటాయి. సమాజంలో అతను ఒక విలువైన వ్యక్తిగా ఉన్నప్పుడు, అతనికి ఉండే ఆలోచనలు అతనికి ఉంటాయి. ఒక్క కూతురు కోసం అతను ఎన్నో రకాలుగా కష్టపడి ఉంటాడు.

రేపు నీ కొడుకు ఇలాగే చేస్తే తట్టుకుంటావా అమృత అంటూ సోషల్ మీడియా అడుగుతుంది. ప్రేమించి తప్పు చేయలేదు ఆమె, తల్లి తండ్రులను మానసికంగా వేధించి తప్పు చేసింది. పట్టుమని పాతికేళ్ళు రాకుండానే పసుపు కుంకుమ తుడుచుకుంది, తల్లి పసుపు కుంకుమలు తుడుచుకుంది. సమాజంలో మారుతీ రావుని… తండ్రులు అందరూ అభినందిస్తున్నారు. ఇదే సమయంలో తప్పుబడుతున్నారు.

చంపుకుంటే కూతురుని చంపుకోవాలి గాని వేరే వాళ్ళను చంపడం ఏంటీ అంటున్నారు. కూతుర్ని అర్ధం చేసుకోలేదు అని మరికొందరు అంటున్నారు, అర్ధం చేసుకున్నా… అతని మనసు అంగీకరించలేదు అని మరికొందరు అంటున్నారు. కాని అతను సైలెంట్ గా ఉంటే బాగుండేది అని మరికొందరు అంటుంటే, అతని స్థానంలో ఉండి ఆలోచిస్తే మీరు ఇదే సలహా పాటిస్తారా అని మరికొందరు అంటున్నారు.

ఇక్కడ కులాలు మతాలు కాదు.. ఆలోచనా విధానం తప్పు, తండ్రిని కూతురు అర్ధం చేసుకోలేదు, కూతుర్ని తండ్రి అర్ధం చేసుకోలేదు. కూతురు కోసం తండ్రి బ్రతికినప్పుడు తన జీవితం కోసం కష్టపడుతున్న తండ్రిని గౌరవించాల్సిన అవసరం ప్రతీ కూతురుకి ఉంది. ప్రేమిస్తే ఒప్పించుకోవాలి. అంతే గాని కుటుంబాలను నాశనం చేయడం అనేది సరైన విధానం ఎప్పటికీ కాదు.