జేఈఈ మెయిన్‌లో ‘ఈడబ్ల్యూఎస్‌’ అభ్యర్థులు రెట్టింపు!

-

– జేఈఈ మెయిన్‌ 2020 జనవరి పరీక్షకు ఈడబ్ల్యూఎస్‌ దరఖాస్తులు 81,143.
– 2019లో 43 వేలు. 2020 పరీక్షకు 81 వేలు

జేఈఈ మెయిన్‌ 2020 జనవరి పరీక్షకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోటాలో 81,143 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి 2019 జనవరి, ఏప్రిల్‌లో నిర్వహించిన ఈ పరీక్షలకు 43,035 మంది మాత్రమే దరఖాస్తు చేయగా 2020, జనవరి మెయిన్‌ పరీక్షకు ఈ సంఖ్య 88 శాతం పెరిగింది. గతేడాది ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు నిర్ణయాన్ని ఆలస్యంగా ప్రకటించడం.. అవగాహన లోపం కారణంగా చాలామంది అర్హులు ఆ కోటాలో దరఖాస్తు చేసుకోలేకపోయారు. 2019 పరీక్షలో జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు కటాఫ్‌ స్కోర్‌ 89.75 ఉండగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాల కోటా కటాఫ్‌ 78.21గా ఉంది.

దీంతో పలువురు ఆ కోటా అర్హులు ఫలితాల వెల్లడి తర్వాత ఆవేదన చెందారు. కొంచెం అప్రమత్తంగా ఉండి రిజర్వేషన్‌ కోటాలో దరఖాస్తు చేసి ఉంటే ఐఐటీలు లేక ఎన్‌ఐటీల్లో సీటు వచ్చేదని వాపోయారు. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ఉన్న సీట్లకు అదనంగా 10 శాతం (సుమారు 1100 – 1200 సీట్లు) పెంచి ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద అర్హులైన వారికి కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెరిగిన అవగాహనతో వచ్చే ఏడాదికి ఈడబ్ల్యూఎస్‌ కోటా దరఖాస్తులు భారీగా పెరిగాయి. దీంతోపాటు బాలికలు కూడా ఈసారి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది రెండు విడతల్లో పరీక్షలకు 12.37 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో బాలికలు 2.75 లక్షల మంది ఉన్నారు. ఈసారి ఆ సంఖ్య మరో 15 వేలకుపైగా పెరిగింది. సూపర్‌ న్యూమరీ కింద విద్యార్థినులకు ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తుండటంతో ఈసారి బాలికల దరఖాస్తులు కూడా పెరిగాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో బాలికల సంఖ్యను 17 శాతానికి పెంచాలన్నది కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ విద్యా సంవత్సరం వారి సంఖ్య 14 శాతానికి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news