సాఫ్ట్‌వేర్ కోడింగ్ తో చిన్నారులకు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు..!

-

విద్యార్థులు చిన్నత‌నం నుంచే కోడింగ్ ప్రాక్టీస్ చేయ‌డం వ‌ల్ల వారు డిగ్రీ చ‌దివే స‌మయానికి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్‌, బ్లాక్ చెయిన్‌, ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్ త‌దిత‌ర అంశాల్లో నిష్ణాతులుగా మార‌వ‌చ్చ‌ని ప‌లువురు ఐటీ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఒక‌ప్పుడు విద్యార్థులు వేస‌వి కాలం వ‌స్తే స్విమ్మింగ్‌, ఆర్ట్‌, డ్యాన్స్‌.. వంటి కోర్సుల్లో శిక్ష‌ణ తీసుకునేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు వారు ఏమాత్రం స‌మ‌యాన్ని వృథా చేయ‌డం లేదు. కొంత స‌మ‌యం ఖాళీ దొరికినా చాలు.. సాఫ్ట్‌వేర్ కోడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. యాప్స్‌, సాఫ్ట్‌వేర్లు, గేమ్స్ డెవ‌ల‌ప్ చేస్తున్నారు. అది కూడా చాలా చిన్న వ‌య‌స్సులోనే. ఈ క్ర‌మంలో వారి చేతికి డిగ్రీ అందే స‌రికి.. ఏదో ఒక కంపెనీకి సీఈవో అవుతున్నారు. అదీ.. నేటి త‌రం విద్యార్థుల ట్రెండ్‌.

అయితే విద్యార్థుల్లో ఈ మార్పుకు కార‌ణం.. సాఫ్ట్‌వేర్ కంపెనీలే అని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ‌లు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌లు ఏటా తాము నిర్వ‌హించే డెవ‌ల‌ప‌ర్ స‌ద‌స్సుల్లో పాల్గొనేందుకు పాఠ‌శాల స్థాయి విద్యార్థుల‌కు అవ‌కాశం ఇస్తుంటాయి. అందులో భాగంగానే ఈ ఏడాది యాపిల్ నిర్వ‌హించిన వార్షిక డెవ‌ల‌ప‌ర్ స‌ద‌స్సు (డ‌బ్ల్యూడ‌బ్ల్యూడీసీ) 2019లో 14 మంది భార‌తీయ విద్యార్థులు పాల్గొన్నారు. వారంతా త‌మ 8వ ఏట నుంచే సాఫ్ట్‌వేర్ కోడింగ్ ప్రాక్టీస్ చేస్తుండ‌డం విశేషం.

కాగా ఆ 14 మంది విద్యార్థులు ఇప్ప‌టికే ఎన్నో యాప్స్‌ను డెవ‌ల‌ప్ చేశారు. వారిలో గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌కు చెందిన స్వప్న‌నిల్ ధోలే అనే విద్యార్థి త‌న 8వ ఏట నుంచే కోడింగ్ ప్రాక్టీస్ చేశాన‌ని, ఎరోనాటికల్‌, ట్యాప్‌2వైఫై అనే 2 యాప్స్‌ను డెవ‌ల‌ప్ చేశాన‌ని, అవి రెండూ ప్ర‌స్తుతం యాపిల్ యాప్ స్టోర్‌లో ఉన్నాయ‌ని, అందుక‌నే త‌న‌కు యాపిల్ స‌ద‌స్సులో పాల్గొనే అవ‌కాశం ల‌భించింద‌ని చెప్పాడు. ఈ క్ర‌మంలోనే యాపిల్ కాకుండా ప‌లు ఇత‌ర సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా ఇప్పుడే ఇదే దిశ‌గా ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేస్తున్నాయి. ముఖ్యంగా భార‌తీయ విద్యార్థుల్లో దాగి ఉన్న కోడింగ్ నైపుణ్యాల‌ను వెలికి తీసే దిశ‌గా ప‌లు వ‌ర్క్‌షాప్‌ల‌ను, స‌ద‌స్సుల‌ను నిర్వ‌హిస్తున్నాయి.

ఇక విద్యార్థులు చిన్నత‌నం నుంచే కోడింగ్ ప్రాక్టీస్ చేయ‌డం వ‌ల్ల వారు డిగ్రీ చ‌దివే స‌మయానికి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్‌, బ్లాక్ చెయిన్‌, ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్ త‌దిత‌ర అంశాల్లో నిష్ణాతులుగా మార‌వ‌చ్చ‌ని ప‌లువురు ఐటీ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే చిన్నారుల‌కు ఆ వ‌య‌స్సు నుంచే ఇలాంటి అంశాల ప‌ట్ల శిక్ష‌ణ‌నిప్పించ‌డం నిజానికి అంత సుల‌భ‌మేమీ కాదు. వారిలో నేర్చుకోవాల‌నే త‌ప‌న ఉండాలి. దీనికి తోడు తల్లిదండ్రుల‌కు ఆర్థిక స్థోమ‌త కూడా ఉండాలి. అయితే ప్ర‌భుత్వాలు చొర‌వ తీసుకుని ఈ విష‌యంలో కొంత స‌హ‌కారం అందిస్తే.. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల నుంచి కూడా అలాంటి నైపుణ్యం ఉన్న ఇంజినీర్లు త‌యార‌వుతారు. వారే దేశ భ‌విష్య‌త్తుకు రేపు మార్గ నిర్దేశ‌కులు అవుతారు..!

Read more RELATED
Recommended to you

Latest news