నీటి కటకటతో ఇబ్బందులు పడుతున్న చెన్నై వాసులకు ప్రముఖ నటుడు రజనీకాంత్ అభిమానులు నీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నారు. రజనీకాంత్ అభిమాన సంఘం రజనీ మక్కల్ మంద్రం చెన్నై వాసులకు ఉచితంగా నీటిని అందిస్తోంది.
చెన్నై నగర ప్రజల నీటి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. వర్షాకాలం ప్రారంభమైన వర్షాలు పడకపోతుండడంతో జనాలకు నీటి ఇక్కట్లు మరింత ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే కనీసం తాగునీరైనా గుక్కెడు దొరుకుతుందని చూస్తున్న ప్రజల ఆశలు అడియాశలే అవుతున్నాయి. మరోవైపు చెన్నై నగరంలోని హోటల్స్, రెస్టారెంట్లు ఇప్పటికే మూత పడ్డాయి. ఇక పలు కంపెనీలు తమ ఉద్యోగులకు తాగునీటిని అందించలేక వారిని ఇంటి నుంచే పనిచేయమని సూచిస్తుంటే.. మరికొన్ని కంపెనీలు తమ ఉద్యోగులు తమ నీటిని తామే తెచ్చుకోవాలని షరతులు విధిస్తున్నాయి. అలాంటి దయనీయమైన స్థితిలో నేడు చెన్నై వాసులు కొట్టుమిట్టాడుతున్నారు.
అయితే నీటి కటకటతో ఇబ్బందులు పడుతున్న చెన్నై వాసులకు ప్రముఖ నటుడు రజనీకాంత్ అభిమానులు నీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నారు. రజనీకాంత్ అభిమాన సంఘం రజనీ మక్కల్ మంద్రం చెన్నై వాసులకు ఉచితంగా నీటిని అందిస్తోంది. ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి ప్రజలకు అందిస్తున్నారు. దీంతో ప్రజలు కొంత ఊరట చెందుతున్నారు. రజనీ ఫ్యాన్స్ చేస్తున్న సేవకు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా చెన్నై నగరవాసుల నీటి కష్టాలను తీర్చేందుకు ముమ్మరమైన చర్యలు చేపట్టింది. రూ.65 కోట్లు వెచ్చించి రైళ్ల ద్వారా చెన్నైకి నీటిని సరఫరా చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే వర్షాలు కురిస్తే ఈ నీటి సమస్య తొలగిపోతుందని అక్కడి వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు..!