కన్వీనర్ కోటాలో 2019-22 బ్యాచ్‌కు చెంది.. పీజీ వైద్య విద్య పూర్తిచేసుకున్న వైద్య విద్యార్థులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ బ్యాచ్‌కు సంబంధించి 893 మంది స్పెషలిస్టు వైద్యులకు ఇవాళ్టి నుంచి పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. వీరందరినీ ఏడాది పాటు తప్పనిసరి సేవల నిబంధన కింద ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియమిస్తున్నట్లు తెలిపింది.
హైదరాబాద్ మినహాయించి (ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలలు కాకుండా) మిగిలిన జిల్లాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియమించడానికి కోఠిలోని వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్ వైద్యులకు పోస్టింగులు ఇవ్వనున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పిడియాట్రిక్స్, రెస్పిరేటరీ మెడిసిన్, డెర్మటాలజీ, సైకియాట్రీ, రేడియాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, రేడియేషన్ ఆంకాలజీ వైద్యులకు పోస్టింగులు ఇస్తామని వైద్యాధికారులు తెలిపారు. రేపు ఉదయం 10 గంటల నుంచి జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, ఆఫ్తల్మాలజీ వైద్యులకు..మధ్యాహ్నం 1.30 గంటలకు అబ్‌స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, అనస్థీషియా వైద్యులకు కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్‌లు ఇస్తారని వైద్య వర్గాలు తెలిపాయి.