గాంధీ జయంతి : శాంతి, అహింసే ఆయన ఆయుధం !

ఒక చెంపపై కొడితే మరొక చెంప చూపించడం మహాత్ముని నైజం. శాంతి, ఆహింసలే ఆయుధాలుగా మలుచుకొని బ్రిటిష్‌వాళ్లతో పోరాడి విజయం సాధించిన గొప్ప స్వాతంత్రోద్యమ నేత మహాత్మాగాంధీ. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా భారత స్వాతంత్య్ర పోరాటంలో మహాత్ముడు కీలక పాత్ర పోషించిన కొన్ని సంఘటనల పరిచయం ఇది.

మహాత్మా గాంధీ చూపిన పోరాట మార్గం ప్రపంచానికే ఆదర్శం. 250 ఏళ్లకుపైగా బ్రిటిష్‌ పాలనలో మగ్గిన భారతీములు స్వేచ్ఛాగా గాలి పీల్చుకోవడానికి కారణం పోరాట పంథానే. గోపాల కృష్ణ గోఖలే పిలుపుతో 1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌ తిరిగి వచ్చారు. మిగతా స్వాతంత్రోద్యమ నాయకులతో కలిసి బ్రిటిషర్లు భారత్‌ వదిలి వెళ్లేంత వరకు పోరాటం చేశారు.

చంపారన్‌ సత్యాగ్రహం 

బిహార్‌లోని చంపారన్‌ ప్రాంత రైతులు నీలి మందును మాత్రమే పండించాలని బ్రిటిష్‌ పలకులు ఒత్తిడి తెచ్చారు. ఎదురు తిరిగిన వారిని చిత్రహింసలు పెట్టారు. దీంతో అన్నదాతలకు మద్ధతుగా గాంధీజీ పోరాటం ప్రారంభించారు. శాంతి యుతంగా పోరాటం చేసిన గాంధీజీ విజయం సాధించారు.

మొదటి ప్రపంచ యుద్ధం 

ఈ సందర్భంగా నాటి వైశ్రాయ్‌ లార్డ్‌ చెమ్స్‌ఫర్డ్‌ గాంధీని ఢిల్లీకి ఆహ్వానించాడు. యుద్ధం గురించి చర్చించి ఆర్మీలో ప్రజలను చేర్చడానికి ఒప్పుకోవాలని కోరాడు. బ్రిటిష్‌ పాలకుల విశ్వాసం చురగొనడం కోసం గాంధీజీ అందుకు అంగీకరించాడు. ‘వ్యక్తిగతంగా ఎవరినీ చంపను లేదా గాయపరచను అది స్నేహితుడైనా, శత్రువైనా సరే’ అని వైశ్రాయ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు.

ఖలీపా ఉద్యం 

ముస్లింలపై గాంధీజీ ప్రభావం ఎంతుందో చెప్పడానికి ఖలీపా ఉద్యమే నిదర్శనం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టర్కీ పాలకుడికి ఉన్న ఖలీపా బిరుదును తొలిగించారు. దీంతో ముస్లింలు పోరాటం ప్రారంభించారు. దీంతో ముస్లింల పోరాటానికి మద్ధతుగా తనకు బ్రిటిష్‌ పాలకులు ఇచ్చిన బిరుదును వెనక్కి ఇచ్చేశారు. ఆనతి కాలంలో ఆయన జాతీయ నేతగా ఎదిగారు.

ఖేడా 

గుజరాత్‌లోని ఖేడా గ్రామం వరదలతో తీవ్రంగా నష్టపోయింది. దీంతో పన్నులు మాఫీ చేయాలని స్థానిక రైతులు పాలకులను కోరారు. పన్నులు కట్టమని రైతులు ప్రమాణం చేయగా వారికి మద్దతుగా గాంధీజీ సంతకాల సేకరణ చేపట్టారు. వాతారణ పరిస్థితి సాధారణ పరిస్థితికి చేరే వరకు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని బ్రిటిష్‌ ప్రభుత్వం తెలిపింది.

సహాయ నిరాకరణోద్యమం 

భారతీయుల నుంచి అందుతున్న సహకారం వల్లే బ్రిటిషర్లు భారత్‌ను పరిపాలించగలుగుతున్నారని గాంధీజీ గ్రహించారు. దీన్ని మనసులో ఉంచుకొని సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ మద్దతు, గాంధీ స్ఫూర్తితో జనం శాంతియుతంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. జలియన్‌వాలా బాగ్‌ ఉదంతంతో సహాయ నిరాకరణ ఉద్యమం ఊపందుకుంది.

ఉప్పు సత్యాగ్రహం 

ఉప్పు సత్యాగ్రహాన్నే దండి ఉద్యమం అని కూడాపిలుస్తారు. ఈ పోరాటం స్వాతంత్య్ర పోరాటంలో కీలకమైంది. దేశానికి మూడువైపులా సముద్రం ఉన్నా.. పన్నుల భారం కారణంగా ఎక్కవ ధర చెల్లించి ప్రజలు ఉప్పు కొనుగోలు చేసేవారు. దీనివల్ల ప్రజలు ఆగ్రహంగా ఉండడంతో 11 డిమాండ్లతో గాంధీజీ లార్డ్‌ ఇర్విన్‌కు లేఖ రాశారు. తమ డిమాండ్లకు తలొగ్గకపోతే ఉప్పు చట్టాన్ని ఉల్లంఘిస్తామని హెచ్చరించారు. సబర్మతి ఆశ్రమం నుంచి 388 కి.మీ. నడిచి సముద్ర తీర ప్రాంతమైన దండి చేరుకున్నారు. 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 6 వరకు 24 రోజులపాటు ఆయన పాదయాత్ర చేపట్టారు. ఆయనకు మద్ధతుగా ప్రజలు పాల్గొనడంతో దండి ఉద్యమం ఊపందుకుంది. సముద్రం ఒడ్డున పిడికెడు ఉప్పును చేతిలోకి తీసుకున్న గాంధీజీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. ఈ సందేశం దేశమంతటా చేరడంతో నగరాల్లోని ప్రజలు బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ఏడాది తర్వాత గాంధీ-ఇర్విన్‌ ఒడంబడికలో భాగంగా ఉప్పుపై పన్నులను ఎత్తివేశారు. భారతీయులు ఉప్పు తయారు చేసుకోవడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం అనుమతిచ్చింది.

క్విట్‌ ఇండియా ఉద్యమం 

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గాంధీజీ క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలువునిచ్చారు. బ్రిటిషర్లు భారతదేశం వదిలి వెళ్లాలని ఆయన డిమాండ్‌ చేశారు. యుద్ధం కోసం బ్రిటిషర్లు భారతీయులను ఆర్మీలో చేర్చుకుంటున్న సమయంలో గాంధీ ఈ పిలుపునిచ్చారు. భారతీయులు యుద్ధంలో పాల్గొనబోరని గాంధీ గట్టిగా చెప్పారు. బ్రిటిషర్లపై పోరాటాన్ని తీవ్రం చేసి స్వాతంత్య్రం సాధించారు.