తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబురం షురూ అయింది. తొమ్మిదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న రాష్ట్రం ఇవాళ్టితో పదో ఏట అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ధూంధాంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కట్టడాలు అవతరణ దినోత్సవ వేడుకలకు ముస్తాబయ్యాయి.
ఉత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగే రాష్ట్ర సచివాలయ భవనాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలు, రకరకాల పూలతో అలంకరించారు. విద్యుత్ దీపాల కాంతిలో కొత్త సచివాలయం మెరిసిపోతోంది. ఇప్పటికే, తెల్లటి ధవళ కాంతితో వెలిగి పోతున్న సచివాలయ భవనం…..సరికొత్త అలంకరణలతో మరింత ఆకర్షణీయంగా మారింది. సచివాలయంతోపాటు హైదరాబాద్ నగరంలోని ప్రధాన కట్టడాలు రంగ రంగు దీపాలతో వెలిగిపోతున్నాయి. అమర వీరుల స్మారక స్తూపం, బీఆర్కే భవన్, కమాండ్ కంట్రోల్ రూం, విద్యుత్‌సౌధ, అసెంబ్లీ, మండలిని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. మరోవైపు రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో సుందరంగా కనిపిస్తున్నాయి. దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.