అధికారముందని అడ్డంగా దోచేసుకుంటారా..? : బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు

అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చించాలని ఇవాళ పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అదానీ అంశంపై చర్చ జరిగితే అదానీ షేర్లు భారీగా పడిపోతాయని బీజేపీ భయపడుతోందని బీఆర్​ఎస్​ పార్లమెంటరీ పార్టీ పక్ష నేత కే కేశవరావు మండిపడ్డారు. అదానీ అంశంపై పార్లమెంటులో చర్చకు బీజేపీ భయపడుతోందని ఆరోపించారు. అదానీ.. మోదీ స్నేహితుడు కాబట్టే పార్లమెంటులో చర్చ జరపడం లేదని దుయ్యబట్టారు. ఎల్‌ఐసీ ద్వారా అదానీకి రూ.వేల కోట్ల మేలు చేశారని ఆరోపించారు.

‘అదానీకి పరిమితంగానే రుణాలు ఇచ్చామని ఇప్పుడు ఎల్‌ఐసీ చెబుతోంది. పరిమితంగానైనా అక్రమాలు చేయవచ్చా. అదానీకి మేలు చేసేందుకు ఇతర పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. పారిశ్రామికవేత్తలను ఈడీ, సీబీఐ పేరిట కేంద్రం బెదిరిస్తోంది. అదానీ అంత వేగంగా ఎలా ప్రపంచ కుబేరుడయ్యారో విచారణ జరపాలి. అధికారంలో ఉన్నారని దేశాన్ని అడ్డంగా దోచుకుంటారా?’ అని ఎంపీ కేశవరావు ప్రశ్నించారు.