కేపిహెచ్బీ కాలనీ, హైటెక్ సిటీ, ఎస్సార్ నగర్, అమీర్ పెట్ చౌరస్తా, సత్యం థియేటర్, మైత్రీ వనం, కోటీ, దిల్ షుఖ్ నగర్… ఇలా ఎక్కడ చూసినా రోడ్లు అన్నీ ఖాళీ గా కనపడుతున్నాయి. ఉరుకుల పరుగుల జీవితం ఒక్కసారిగా నాలుగు గోడలకు పరిమితం అయిపోయింది. ఇంట్లో నుంచి బయటకు తొంగి కూడా చూడటం లేదు. మైత్రీ వన౦, బొరబండ, ఎర్రగడ్డ, జుబ్లీ చెక్ పోస్ట్ అని అరిచే ఆటో వాలా కనపడటం లేదు.
గోకుల్ చాట్ ఖాళీగా ఉంది, ఎన్టీఆర్ పార్క్ లో సిబ్బంది మినహా ఎవరూ లేరు, ట్యాంక్ బండ్ అయితే ఎన్టీఆర్ పార్క్ ని లుంబినీ పార్క్ ని చూసి ఎవరైనా వచ్చారా, అక్కడికి వస్తే నా దగ్గరకు ఎందుకు రావడం లేదు అని ఎదురు చూస్తుంది. ఆర్టీసి క్రాస్ రోడ్స్ ఖాళీ గా ఉన్నాయి. నారాయణ గూడ ఫ్లై ఓవర్ లో సైకిల్ కూడా తిరగడం లేదు. పానీ పూరి లేదు, హైదరాబాద్ బిర్యాని లేదు, సుజనా మాల్ లేదు, అన్నీ కూడా జనాలు లేక బోసిపోతున్నాయి.
ఇదండి హైదరాబాద్ పరిస్థితి. ఇంత కంటే గొప్పగా ఏమీ లేదండి హైదరాబాద్ పరిస్థితి. జనాలతో ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతాలు ఇప్పుడు కరోనా దెబ్బకు అలా మౌనంగా చూస్తూ ఉన్నాయి. రోజు పలకరించే వాడు ఇవాళ లేక అన్ని ప్రాంతాలు జనాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఒక్కరికి వస్తే అందరూ భయపడుతున్నారు. ఎమైపోతుందో అనే ఆందోళనలో ఉన్నారు. ఫలితంగా హైదరాబాద్ ఇప్పుడు మౌనంగా ఏడుస్తుంది.