హైదరాబాద్ ని షట్ డౌన్ చేసే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ నేపధ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు చాలా వరకు అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా కరోనా వైరస్ మీద సమిష్టిగా యుద్ధం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే స్కూల్స్, కాలేజీలు, వ్యాపార సముదాయాలు మూసి వేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న కర్ణాటకలో ఇప్పటికే షట్ డౌన్ ప్రకటించారు. వైరస్ క్రమంగా విస్తరించే అవకాశం ఉన్న నేపధ్యంలో అందరూ అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా షట్ డౌన్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. శాసన సభలో శనివారం ఉదయం మాట్లాడిన ముఖ్యమంత్రి కెసిఆర్… కరోనాపై ముందస్తు చర్యల్లో భాగంగా నియమించిన హైలెవల్ కమిటీ సమావేశం కొనసాగుతోందని..
సాయంత్రం 5.30 గంటల వరకు దానిపై ఒక స్పష్టత వస్తుందని సీనియర్ సెక్రటరీలు, పంచాయితీరాజ్, విద్యాశాఖ, ట్రాన్స్‌పోర్ట్, ఇతర శాఖల సెక్రటరీలంతా అందులో పాల్గొంటారని చెప్పారు. అదే విధంగా స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్స్ వంటి వాటిని మూసివేయాలా..? పబ్లిక్ ఫంక్షన్లు, ఈవెంట్స్ విషయంలో ఎలా వ్యవహరించాలి వంటి అంశాలపై ఇందులో చర్చిస్తారని కెసిఆర్ అన్నారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్నీ మూసి వేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై కెసిఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం వెల్లడించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్ లో అన్ని వ్యాపార సముదాయాలతో పాటుగా పలు ఫంక్షన్స్ ని కూడా రద్దు చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ముప్పు ఉందని అంచనాకు వస్తే మాత్రం కచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.