దేశమా… ఒకసారి ఈ ఫోటో చూడుమా !!

-

లోకంలో పాపం పెరిగిపోయిందండీ అన్ని ఒకరంటుంటే… కలికాలం అంతానికి  వచ్చిందండి అని మరొకరు చెబుతున్నారు! క్రీస్తు రెండో రాకడకు ఇవి సూచనలు అండీ అని ఒకరంటంటూ… ఇది మూడో ప్రపంచయుద్దానికి పునాదండి అని మరొకరు  చెప్పుకొస్తున్నారు. మనం చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం, ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడకుండా చూస్తున్నాం అని ఒకరంటే… భారత్ కరోనాను జయించి తీరుతుంది అని మరొకరు జోస్యం చెబుతున్నారు. ఇందులో ఎన్ని వాస్తవాలు, మరెన్ని భ్రమలు ఉన్నాయి అనే సంగతి కాసేపు పక్కన పెడితే… తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఫోటో చూస్తే మాత్రం… కరోనా గురించి అందరికీ తెలిసినంతగా ఆకలికి మాత్రం తెలియదు కదా అనిపించక మానదు!

కరోనా పుణ్యమా అని దేశంలో వలస కూలీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఫోటో ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుంది! ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో.. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ శ్మశాన వాటికలోనిది.
అవును… కరోనాకి తమ ఆకలి గురించి తెలియదు అని గ్రహించారో లేక మా ఆకలి  కేకలు నాయకులకు వినిపించవని భావించారో తెలియదు కానీ… పనికిరావని  గుర్తించి శ్మశానంలో పారబోసిన అరటిపళ్లపై ఈ వలస కూలీలు ఆకలితో వాలిపోయారు పాపం!

కరోనా వస్తే బలితీసుకోవడానికి కాస్త టైం తీసుకోవచ్చేమో కానీ… ఆకలికి ఆ ఛాన్స్ లేదని భావించారో ఏమో… తినడానికి పనికిరావని తెలిసినా… దొరికినమట్టుకు ఏరుకుని తిన్నారు.. కొన్ని రాత్రికి పట్టుకుని వెళ్లారు! ఈ ఒక్క సంఘటన వలసకూలీల తాజా పరిస్థితిని, దీనస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ కరోనా పుణ్యమా అని రెస్టు తీసుకునే వారు రెస్ట్ తీసుకుంటుంటే…
పస్తులుండేవారు మాత్రం పస్తులుంటూనే ఉన్నారు.. ఇబ్బందులు పడేవారు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నాయకులూ, స్వచ్చంద సంస్థలూ.. కాస్త వీరి వైపు ఒకసారి చూడండి ప్లీజ్!!

Read more RELATED
Recommended to you

Latest news