చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ఆ దేశం కన్నా ఇతర దేశాలను పట్టిపీడిస్తోంది. ముఖ్యంగా అమెరికా, యూరప్, ఇండియా దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. తొలివేవ్ లో అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు అతలాకుతలం అయ్యాయి. ఆ దేశాల్లో తీవ్రంగా కేసులు వ్యాపించాయి. ముఖ్యంగా అమెరికాలో అనేక మంది కరోనా బారిన పడ్డారు. మరణాల్లో అమెరికా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా అమెరికాలో కరోనా మరణాలు 10 లక్షల మార్క్ ను దాటింది. ప్రతీ 327 మంది అమెరికన్లలో ఒక మరణం చోటు చేసుకుందని రాయిటర్స్ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ -19ను మార్చి 11, 2020లో ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. అప్పటికే అమెరికాలో 36 మంది ఈ వ్యాధిన పడి మరణించారు. జనవరి 2021 నాటికి 405,000 కంటే ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికన్ సైనిక మరణాలను మించి పోయింది. తాజాగా అమెరికాలో 10 లక్షల కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.