కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే ఆల్కహాల్ తాగొద్దంటా..?

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు అతి త్వరలో వ్యాక్సిన్ రాబోతుంది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, రష్యా వంటి దేశాల్లో కరోనా నిర్మూలనకు వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు. అయితే భారత్ లో కూడా రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చ జరుగుతోంది. అయితే వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి.

alcohol
alcohol

వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తాగొద్దని వైద్యులు పేర్కొంటున్నారు. మద్యం సేవించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుందని వారు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు అది శరీరంలో బ్యాక్టీరియాలు, వైరస్ నిర్మూలన ప్రక్రియను కొనసాగిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచేందుకు తోడ్పడుతుంది. మద్యం సేవించడం వల్ల యాంటీబాడీలు తీవ్రంగా దెబ్బ తింటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

శరీరంలో శ్వేత రక్త కణాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. శ్వేత రక్త కణాలు రోగ నిరోధక శక్తిని పెంపొందించి.. వైరస్, బ్యాక్టీరియాతో పోరాటం చేస్తాయి. అయితే కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక మద్యం సేవించడంతో శ్వేత రక్త కణాలు నశిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే కరోనా వ్యాక్సినేషన్ చేసుకున్న తర్వాత మద్యం సేవించకూడదని వారు హెచ్చరిస్తున్నారు.

ఈ మేరకు మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రోన్ క్స్ ఇఖారియా ప్రయోగం చేశారు. కరోనా వ్యాక్సినేషన్ చేసిన తర్వాత మద్యం సేవించాక.. తాగకన్న ముందు రక్తం నమూనాలను సేకరించారు. వాటిలో చెరో మూడు గ్లాసుల్లో నింపి పరిశోధనలు నిర్వహించారు. మద్యంతో ఉన్న రక్త నమూనాలు వైరస్ తో పోరాడే శక్తి తక్కువగా కలిగి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వాటిలో దాదాపు 50 శాతం లింఫోసైట్స్ తగ్గినట్లు తేల్చారు. లింఫోసైట్స్ తగ్గితే శరీరంలో రోగనిరోధక శక్తి క్షీణిస్తుందని ఇమ్యూనాలజిస్ట్ ప్రొఫెసర్ క్రుక్ షాంక్ తెలిపారు.

ఆక్స్ ఫర్డ్ లోని ఆస్ట్రాజెనికాకు చెందిన కోవిషీల్డ్, హైదరాబాద్ కు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ల వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్లపై భారత్ లో ట్రయల్ రన్స్ కూడా నిర్వహించారు. సత్ఫలితాలు ఇవ్వడంతో త్వరలోనే భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.