కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ మందును కనిపెట్టలేకపోయారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న పలు రకాల మెడిసిన్ల ద్వారానే కరోనాకు చికిత్స చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో భారత్ మెడిసిన్లకు కొరతను ఎదుర్కొంటుందని ఫార్మా కంపెనీలు చెబుతున్నాయి. ఎందుకంటే.. చాలా వరకు ఫార్మా కంపెనీలు హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉండడం.. ఆయా ఏరియాలను కంటెయిన్‌మెంట్ జోన్లుగా ప్రకటించడంతో.. చాలా తక్కువ ఉద్యోగులతో కంపెనీలు నడుస్తున్నాయి. ఇక ఆయా కంపెనీలకు కావల్సిన ముడి పదార్థాల కొరత కూడా ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డి, బరోటివాలా, నాలాగఢ్ ప్రాంతాల్లో మొత్తం 550 వరకు ఫార్మా కంపెనీలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఆసియాలోనే అతి పెద్ద ఫార్మా హబ్‌గా ఈ ప్రాంతాలు పేరుగాంచాయి. భారత్‌తోపాటు విదేశాలకు ఎగుమతి అయ్యే మందుల్లో చాలా వరకు ఇక్కడే తయారవుతాయి. ఇక మొత్తం కంపెనీల్లో 500 కంపెనీలు చిన్న, మధ్య తరహా కంపెనీలే. ఇక ఈ కంపెనీలు ఇప్పుడు పెద్ద కంపెనీలకు కావల్సిన ముడి పదార్థాలను సప్లయి చేయలేకపోతున్నాయి. మరోవైపు వాటిని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుందామంటే.. రవాణా చార్జిలు, పదార్థాల ధరలు తడిసి మోపెడవుతున్నాయి. జనవరి నెలలో ఉన్న ఆయా పదార్థాల ధరలు ఇప్పుడు రెట్టింపయ్యాయి. కొన్ని ముడిసరుకుల ధరలు చాలా రెట్లు పెరిగాయి. దీంతో ఫార్మా కంపెనీలు ముడి సరుకు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో కరోనా చికిత్సకు వాడే పలు జ్వరం మందులు, యాంటీ వైరల్ ట్యాబ్లెట్ల ఉత్పత్తి బాగా తగ్గింది.
అయితే మరో 2 లేదా 3 వారాల్లో పరిశ్రమలపై ఉన్న ఆంక్షలు సడలిస్తే.. కొంత వరకు మెడిసిన్ల కొరత సమస్య నుంచి బయట పడవచ్చని ఫార్మా కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుతం అన్ని కంపెనీలు తమ మొత్తం సిబ్బందిలో కేవలం 25 నుంచి 30 శాతం సిబ్బందితోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే మరో 2 లేదా 3 వారాల్లో పరిస్థితి మెరుగు పడితే సిబ్బందిని అధిక మొత్తంలో పనికి వినియోగించి తద్వారా మెడిసిన్ల ఉత్పత్తిని పెంచవచ్చని ఫార్మా కంపెనీలు చెబుతున్నాయి. మరి మందులకు కొరత రాకుండా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి..!