కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక్కసారిగా కుప్ప కూల్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది ఇప్పటికే ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. త్వరలో వీరి సంఖ్య మరింతగా పెరగనుంది. ఇక అమెరికాలో హెచ్1బి వీసాపై పనిచేస్తున్న భారతీయుల ఉద్యోగాలకు కూడా పెద్ద ఎత్తున కోత పడనుందని తెలిసింది. ఇప్పటికే అక్కడ 3.3 మిలియన్ల మంది తమ ఉద్యోగాలు పోయాయని చెప్పగా.. రానున్న రోజుల్లో ఆ సంఖ్య 47 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక అక్కడి కంపెనీల్లో చాలా వరకు ఐటీ కంపెనీలే ఉండడం.. వాటిల్లో భారత్ నుంచి వచ్చిన వారే ఎక్కువగా పనిచేస్తుండడంతో.. ఇప్పుడు వారు తమ జాబ్‌లను కోల్పోతారని తెలుస్తోంది. దీంతో అమెరికాలో ఉన్న భారతీయులు ఇప్పుడు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే అమెరికాలో హెచ్1బి వీసాపై పనిచేస్తున్న భారతీయులు తమ ఉద్యోగాలను కోల్పోతే.. అక్కడి రూల్స్ ప్రకారం 60 రోజుల్లోగా కొత్త జాబ్ వెదుక్కోవాలి. లేదా స్వదేశానికి తమ కుటుంబ సభ్యులతో సహా వెళ్లిపోవాలి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో జాబ్ పోతే మళ్లీ కొత్త జాబ్ దొరికే అవకాశం దాదాపుగా లేనందున.. తమ హెచ్1బి వీసా గడువును 180 రోజుల వరకు పెంచాలని అనేక మంది భారతీయులు ఇప్పుడు కోరుతున్నారు. ఈ మేరకు వారు ఒక ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. దానిపై ఇప్పటికే 20వేల మంది సంతకాలు చేశారు. అయితే వైట్ హౌస్ వీరి పిటిషన్‌ను స్వీకరించాలంటే.. అందుకు 1 లక్ష మంది సంతకాలు అవసరం.
కాగా కరోనా వైరస్ నేపథ్యంలో.. ఐటీ సహా పలు ఇతర రంగాలకు చెందిన కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయులు పెద్ద ఎత్తున ఉద్యోగాలను కోల్పోతారని తెలుస్తోంది. ఈ క్రమంలో వారు 60 రోజుల్లోగా జాబ్ వెదుక్కోకపోతే తప్పనిసరిగా స్వదేశానికి వెళ్లిపోవాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వారు ఇండియాకు వచ్చేందుకు అవకాశం లేదు. దీంతో వారు తమకు ఏం చేయాలో తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇక అమెరికాలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుండడం కూడా అనేక మందిని ఆందోళనకు గురి చేస్తోంది. మరి హెచ్1బి వీసాల గడువు పెంపు విషయంపై ట్రంప్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. వేచి చూస్తే తెలుస్తుంది..!