ప్రపంచాన్ని పెట్టెలో పెట్టి తాళం వేసిన కరోనా వైరస్ కొవిడ్-19 కారణంగా.. ప్రజలు హడలి పోతున్నారు. కు ల-మత, ప్రాంతీయ, వర్గ, వయో, లింగ బేధం లేకుండా సంక్రమించే ఈ వైరస్ కారణంగా నేలరాలుతున్న వారి సంఖ్య వేలల్లో ఉండడం నానాటికీ పెరుగుతుండడం గమనార్హం. ఇక, ఇప్పటికిప్పుడు కరోనాను కట్టడి చేసేందుకు మనముందున్న ఏకైక దివ్య ఔషధం.. సామాజిక దూరం పాటించడమే. ఇళ్లకే పరిమితం కావ డం. వీటి ద్వారానే కరోనాను కట్టడి చేయగలమని అంటున్నారు పరిశోధకులు. దీంతో ప్రబుత్వాలు కూడా ఇదే సూత్రాన్ని పట్టుకుని ముందుకు సాగుతున్నాయి.
స్వచ్ఛందంగానో.. బలప్రయోగంతోనో ప్రభుత్వాలు ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా నుంచి భయపడినా.. దీనివల్ల ప్రాణభయం ఉన్నా.. కీలకమైన రెండు విషయాలు ఈ కరోనా నేర్పు తోందని అంటున్నారు పరిశీలకులు. ఒకటి సహనం. రెండు ఓర్పు! ప్రజలకైనా, ప్రభుత్వానికైనా కూడా ఈ రెండు కీలకమే. కానీ… మనీ వేటలో పడిన మానవుడు ఈ రెండిటికీ దూరం అయ్యాడని మానసిక శాస్త్ర విశ్లేషకులు చెబుతున్నారు ఈ కారణంగానే మనిషికి ఒత్తిడి పెరిగిపోయిందని చెబుతున్నారు.
అంతేకాదు, సహనం, ఓర్పు లేక పోవడం వల్ల సమాజంలో నేరాల ప్రవృత్తి పెరుగుతుందని, కుటుంబాల మధ్య సంబంధాలు కూడా సన్నగిల్లుతాయని చెబుతున్నారు. ఇప్పుడు కరోనా నేపథ్యంలో ప్రజలు ఇంటి పట్టునే ఉండడం వల్ల భార్యమీద భర్త, బర్తమీద భార్య ఒక అవగాహనకు రావడం వల్ల వీరిలో సహనం, ఓర్పు రెండూ పెరుగుతున్నాయని చెబుతున్నారు. అదేసమయంలో కరొనా కు వైద్యం లేదని అంటున్నా.. వైద్యశాలల్లో డాక్టర్లు, నర్సులు చూపించే ఓపిక, సహనం వంటివి రోగుల ప్రాణాలను తిరిగి నిలబెడతాయని చెబుతున్నారు.
దీనికి ఉదాహరణే.. తాజాగా కేరళలో ప్రాణాంతక వైరస్ కోవిడ్-19 బారిన పడిన 93 ఏళ్ల వృద్ధుడు, ఆయన భార్య(88), కుటుంబం కోలుకున్నారు. నిజానికి 65 ఏళ్లు పైబడిన వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే.. మరణించడం ఖాయమని చెబుతున్న సమయంలో వీరిద్దరు మళ్లీ ఇంటికి చేరడం వెనుక ఏంజరిగింది? అని ఆలోచిస్తే.. వారికి సేవలు అందించిన ఓ నర్సు… నచ్చజెప్పి మానసికంగా ధైర్యంగా ఉండాలంటూ వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. ఓర్పు, సహనంతో వారికి సేవలు చేశారు. దీంతో రెండు నిండు జీవితాలు మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. ఒకింత ఇబ్బందిగా ఉన్నా.. కరోనా సమయంలో మనలోని ఓర్పు, సహనం వెలుగు చూస్తున్నాయి. వీటిని మరింత పెంచుకునేందుకు, జీవితంలో కొనసాగించేందుకు ప్రయత్నిద్దాం.