ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం.. దేశాన్ని మళ్లీ కరోనా కోరల్లోకి నెట్టిందా? అంటే.. తాజా పరిణామాలను గమనిస్తున్న వారు ఔననే అంటున్నారు. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎలాంటి మందూ లేకపోవ డంతో ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మనుషులు ఒకరికొకరు దూరంగా ఉండడం తప్ప చేయాల్సింది ఏమీలేదని తెలుసుకుని .. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. దీంతో మన దేశంలోనూ మార్చి 25 నుంచి సోషల్ డిస్టెన్స్‌ను అమలు చేస్తూ.. లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. ఇప్పటికే దఫదఫాలుగా ఈ లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రస్తుతం మన దేశంలోమూడో దశ లాక్డౌన్ అమలవుతోంది. ఇది ఈ నెల 17 వరకు అమలు కానుంది.
అయితే, సుదీర్ఘ ఈ విరామం కారణంగా పనులు, పరిశ్రమలు నిలిచిపోయి.. ప్రజలు, ప్రభుత్వాలు కూడా ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంపై ఆర్ధికంగా ఆదుకోవాలంటూ ఒత్తిడులు కూడా పెరుగుతున్నాయి. అయితే, ఈ విషయంలో ఇప్పటికే కొంత చేశామని, సో.. మూడో దశ లాక్డౌన్ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలు, కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో సాధారణ జనజీవనానికి , పరిశ్రమలు తెరిచేందుకు ఎలాంటి ఇబ్బంది లేనందున వాటిని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అదేసమయంలో ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరు వంటి మద్యం దుకాణాలను తెరుచుకునేందుకు కూడా కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయమే ఇప్పుడు మళ్లీ దేశంలో కరోనా వ్యాప్తికి కారణంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 4 నుంచి మూడో దశ లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో.. చాలా అంశాల్లో కల్పించిన వెసులు బాటుతో ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. పరిశ్రమలు, కంపెనీలు తెరుచుకున్నాయి. అయితే, సందట్లో సడేమియా మాదిరిగా .. లాక్డౌన్ నిబంధనలను అందరూ తుంగలో తొక్కారు. మాస్కులు కనిపించడం లేదు. అత్యంత కీలకమైన భౌతిక దూరాన్ని దూరం చేశారు. ఫలితంగా ఇప్పుడు మళ్లీ.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెలుసు బాటు ఇవ్వకపోతే.. ఇవ్వలేదని రొద పెట్టిన ప్రజలు.. ఇప్పుడు ఇచ్చిన వెసులుబాటును తమ ఇష్టానుసారం గా వ్యవహరిస్తున్నారు.
ఏపీ, తెలంగాణల విషయానికి వస్తే.. ఇక్కడ దాదాపు 40 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరిచారు. ఈక్రమంలో భారీ ఎత్తున మద్యం ప్రియులు పోటెత్తారు. దుకాణాల ముందు కిలో మీటర్ల లెక్కన క్యూలు కనిపించాయి. అయినప్పటికీ డిస్టెన్స్ ఎవరూ పాటించలేదు. మాస్కులు కట్టుకోలేదు. తెలంగాణలో అయినా, ఏపీలో అయినా మాస్క్ ఉంటేనే మద్యం ఇవ్వాలని ప్రభుత్వాలు షరతు పెట్టినా.. వినియోగదారులు పట్టించుకోలేదు.. అమ్మకం దారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరించారు. దీంతో పరిస్థితి మళ్లీ దారుణంగా తయారయ్యేలా ఉందనే హెచ్చరికలు సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం. మరి ప్రజలే స్వయం నియంత్రణను పాటించాల్సిన అవసరం ఉందని అంటున్నారు నిపుణులు.