క‌రోనా ఎఫెక్ట్‌.. ఇక‌పై అంతా ఆన్‌లైన్‌లోనే.. డిజిట‌ల్ బాట‌లో జ‌నాలు..!

-

గుట్టు చ‌ప్పుడు కాకుండా దొంగ దారిలో మ‌న దేశంలోకి ప్ర‌వేశించిన క‌రోనా వైర‌స్ ఇక్క‌డి ప్ర‌జ‌ల జీవితాల‌లో పెను మార్పులు తీసుకువ‌చ్చింది. గ‌తంలో ఎక్క‌డ చూసినా జ‌నాలు గుంపులు గుంపులుగా తిరిగేవారు. కానీ ఇప్పుడు భౌతిక దూరం నిబంధ‌న‌ల‌ను పాటిస్తున్నారు. వైర‌స్ రాకుండా మాస్కులు ధ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లించింది. అయితే లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎప్పుడు ఎత్తేస్తారో, అస‌లు కరోనా ప్ర‌భావం ఎప్ప‌టికి పూర్తిగా త‌గ్గుతుందో.. ప్ర‌స్తుతం తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో అన్ని కార్య‌క‌లాపాలు జ‌ర‌గ‌డం క‌ష్టంగా మారింది. అయితే ఇందుకు డిజిట‌ల్ మాధ్య‌మం పరిష్కారం చూపుతోంది. ఇక‌పై ప్ర‌జ‌ల‌కు ఏది కావాలన్నా, వారు ఏం చేయాల‌న్నా.. అన్నీ ఆన్‌లైన్‌లోనే జ‌ర‌గ‌నున్నాయా.. అంటే.. అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

corona effect people are shifting to digital way

ఇప్ప‌టికే కిరాణా స్టోర్లు, మందులు త‌దిత‌ర నిత్యావ‌స‌రాల‌ను జ‌నాలు ఎక్కువ‌గా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. గ‌తంలో కూడా వీటిని ఆన్‌లైన్‌లో జ‌నాలు కొన్నారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది. ఎక్కువ శాతం మంది ఏ వ‌స్తువు అయినా స‌రే.. దాన్నిఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకే ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇక మొన్న‌టి నుంచి మ‌ద్యం షాపుల‌ను ఓపెన్ చేశారు. కానీ మ‌ద్యం ప్రియులు షాపుల వ‌ద్ద భౌతిక దూరం నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేద‌ని చెప్పి.. ఢిల్లీ, పంజాబ్ త‌దితర రాష్ట్రాల్లో మ‌ద్యాన్ని ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు.

ఇక మే 17వ తేదీ త‌రువాత లాక్‌డౌన్‌ను కేంద్రం మ‌ళ్లీ క‌చ్చితంగా పొడిగించే అవ‌కాశం ఉండ‌డంతో.. విద్యార్థుల చ‌దువుల కోసం స్కూళ్ల‌ను డిజిట‌ల్ స్కూళ్లుగా మార్చే కార్య‌క్ర‌మం చేప‌ట్టనున్నారు. విద్యార్థుల‌ను వారి రూల్ నంబ‌ర్ల ప్ర‌కారం స‌రి, బేసి విధానంలో స్కూళ్ల‌కు వెళ్లేలా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందిస్తున్నారు. దీంతో విద్యార్థుల‌కు స‌గం పాఠాలు స్కూళ్ల‌లో చెబుతారు. సగం పాఠాలను వారు ఆన్‌లైన్‌లోనే నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే లాక్‌డౌన్ ముందు వ‌ర‌కు ప‌లు యాప్‌లు నిర్దిష్ట‌మైన ఫీజుతో ఆన్‌లైన్‌లో డాక్టర్ల‌ సేవ‌ల‌ను అందించాయి. కానీ ఇప్పుడు ఆ సేవ‌లు మ‌రింత విస్తృతం కానున్నాయి. దీంతో చిన్న‌పాటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ప్ర‌జ‌లు ఇక‌పై ఆస్ప‌త్రుల‌కు వెళ్లే అవ‌కాశంలేదు. అంతా ఆన్‌లైన్‌లోనే జ‌రుగుతుంది.

అదేవిధంగా కార్లు, టూ వీల‌ర్ల త‌యారీ కంపెనీలు కూడా ఆన్‌లైన్‌లోనే వాహ‌నాల‌ను కొనుగోలు చేసేలా ప్ర‌త్యేకంగా త‌మ త‌మ సైట్ల‌లో వ‌ర్చువ‌ల్ స్టోర్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. కార్ల త‌యారీదారు మ‌హీంద్రా అండ్ మహీంద్రా ఇప్ప‌టికే ఆన్‌లైన్ ద్వారా కార్ల‌ను కొనుగోలు చేసే అవ‌కాశం క‌ల్పిస్తోంది. ఇక ఎల‌క్ట్రానిక్స్‌, ఫోన్లు, కంప్యూట‌ర్లు, దుస్తులు, ఫ్యాష‌న్ ఉత్ప‌త్తులు.. త‌దిత‌రాల‌ను ఇప్ప‌టికే జ‌నాలు ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల‌కు చెందిన సైట్ల‌లో కొనుగోలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ఆ కొనుగోళ్లు ఇంకా ఎక్కువ సంఖ్య‌లో జ‌రుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. అలాగే ప‌లు వ‌స్త్ర‌, బంగారు ఆభ‌ర‌ణాల‌ను విక్ర‌యించే య‌జ‌మానులు త‌మ షాపుల‌కు సంబంధించి వ‌ర్చువ‌ల్ స్టోర్ల‌ను ఏర్పాటు చేసే ప‌నిలో ఉన్నారు. దీంతో క‌స్ట‌మ‌ర్లు ఆన్‌లైన్‌లోనే దుస్తులు, బంగారు న‌గ‌లను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

కాగా ప‌లు ఫోన్ల త‌యారీ సంస్థ‌లు త‌మ ఫోన్ల‌ను వాట్సాప్ ద్వారా కొనుగోలు చేసేందుకు వీలు క‌ల్పించ‌నున్నాయి. వాట్సాప్‌లో క‌స్ట‌మ‌ర్ ఫోన్‌ను ఆర్డ‌ర్ చేస్తే.. అత‌నికి స‌మీపంలో ఉన్న స్టోర్ నుంచి ఆ ఫోన్ డెలివ‌రీ అవుతుంది.. అదేవిధంగా అనేక కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోంకు వీలున్న చోట ఈ ఏడాది ముగింపు వ‌ర‌కు ఇంటి నుంచే ఉద్యోగులు ప‌నిచేసే వెసులుబాటు క‌ల్పిస్తున్నాయి. ఈ క్ర‌మంలో చాలా వ‌ర‌కు కార్య‌క‌లాపాలు అన్నీ ఆన్‌లైన్‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. అయితే కరోనా ప్ర‌భావం పూర్తిగా త‌గ్గి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేశాక‌.. కొంత కాలానికి తిరిగి య‌థాత‌థ ప‌రిస్థితులు ఏర్ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు..!

Read more RELATED
Recommended to you

Latest news