కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో వ్యాప్తిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ రాష్ట్రానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోకు చెందిన ఆరుగురు సభ్యుల బృందాన్ని పంపాలని గురువారం నిర్ణయించింది. గత మూడు రోజులుగా కేరళలో రోజువారీ కేసులు 22,000కు పైగా నమోదయ్యాయి. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో ఒక్క కేరళలోనే 50శాతం వెలుగు చూస్తుండటం పరిస్థితి తీవ్రతను తెలుపుతున్నది.
కేరళ వెళ్లనున్న ఆరుగురు సభ్యుల బృందానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్‌కే సింగ్ సారథ్యం వహించనున్నారు. వైద్య బృందం శుక్రవారం కేరళకు చేరుకోనున్నది. వైరస్ వ్యాప్తి అత్యధికంగా ఉన్న జిల్లాలను సందర్శించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్రాల వారీ సెరో సర్వే ప్రకారం కేరళలో ఆరు సంవత్సరాల పైబడిన జనాభాలో కేవలం 44శాతం మందికి మాత్రమే కరోనా బారిన పడినట్లు తేలింది. కానీ, దేశ సగటు 67శాతం ఉండటం గమనార్హం. సెరో సర్వే ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ జనాభాలో అత్యధిక మంది కరోనా బారిన పడే అవకాశం ఉన్నది. దీనిని దృష్టిలో పెట్టుకొని పరిశీలిస్తే కేరళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎందుకు కేసులు నమోదవుతున్నాయో అర్థమవుతుంది.