కేరళ రాష్ట్రంలోని అళప్పుర హౌజ్ బోట్లకు చాలా ఫేమస్. వాటిపై ప్రయాణించేందుకు దేశవిదేశాల నుంచి ఎంతో మంది టూరిస్టులు అక్కడికి వెళ్తుంటారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఇప్పుడా బోట్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. దీంతో కేరళ ప్రభుత్వం ఆ బోట్లను ఐసొలేషన్ వార్డులుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అళప్పుర కలెక్టర్ ఎం.అంజన మీడియాకు వివరాలను వెల్లడించారు.
అళప్పుర ప్రాంతంలో ఉన్న హోటల్స్, రిసార్టులు, హాస్టళ్లు, లాడ్జిలు తదితర ప్రదేశాల్లో మొత్తం 5806 బెడ్లను అధికారులు సిద్ధం చేశారు. వీటిని ఐసొలేషన్, క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించనున్నారు. ఇక అత్యవసర పరిస్థితి వస్తే హౌజ్ బోట్లను ఐసొలేషన్ వార్డులుగా ఉపయోగించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే.. సదరు బోట్ల ఓనర్లతో మాట్లాడామని కలెక్టర్ అంజన తెలిపారు. కాగా అన్ని హౌజ్ బోట్లు కలిపితే మొత్తం 1500 నుంచి 2000 వరకు బెడ్లను సిద్ధం చేయవచ్చని.. వీటిని ఐసొలేషన్ వార్డులుగా ఉపయోగించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
ఇక అవసరం అయితే హౌజ్ బోట్లను ఎక్కడికంటే అక్కడికి నడిపించవచ్చు కనుక.. వాటిల్లో బెడ్లను సిద్ధం చేస్తే.. వాటిని కరోనా పేషెంట్ల చికిత్సకు ఉపయోగించవచ్చని కేరళ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆ బోట్లను ఇప్పుడు ఐసొలేషన్ వార్డులుగా మార్చే కార్యక్రమం చేపట్టారు. కాగా ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌తో బోట్లు ఖాళీ ఉంటున్నాయి కానీ.. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పటినుంచి నిజానికి ఆ బోట్లకు అంతగా ఆదాయం రావడం లేదు. చాలా తక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తుండడంతో బోట్ల ద్వారా ఆదాయం కూడా తక్కువగా వస్తుందని ఓనర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ బోట్లను ఇప్పుడు ఐసొలేషన్ వార్డులుగా మార్చనున్నారు..!