తెలంగాణ ప్రభుత్వం చేసే లోటుపాట్లను నిత్యం వేలెత్తి చూపే నిలువెత్తు రాజకీయ నాయకుడు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. తరచూ తన చేష్టలతో వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తారు. ఈసారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకే లేఖ రాశారు. కరోనా కట్టడి లో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వియఫలమయ్యిందని ఆ లేఖ లో ఆయన తెలియజేశారు. కేంద్రం కళ్లుగప్పి హైకోర్టు ఐసీఎంఆర్ మార్గదర్శకాలను పక్కనబెట్టి తనకు నచ్చినట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ లో కరోనా విజృంభణ భారీగా ఉందని ముఖ్యంగా హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో తారా స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే త్వరలో హైదరబాద్ అంతా హాట్ స్పాట్ గా మారిపోతుందని నేరుగా కేంద్రం తలదూర్చక తప్పదని ఆయన లేఖ లో ప్రస్తావించారు. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు కేవలం 70 వేల కోవిడ్ టెస్టులు మాత్రమే చేశారని తెలిపారు. రాష్ట్రంలో కేవలం 22 ట్రూనాట్ కిట్స్, ఒకే ఒక సెంట్రల్ ల్యాబ్ ఉందని రేవంత్ చెప్పారు. టెస్టుల విషయంలో హైకోర్టు, ఐసీఎంఆర్ మార్గదర్శకాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. హైదరాబాదు పరిసరాల్లో ఎన్నో ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయని… వాటిని ప్రభుత్వం వాడుకోవడం లేదని ఆయన అన్నారు. స్వయానా కేంద్రమే హైదరబాద్ ను పర్యవేక్షించాలని లేకపోతే పరిణామాలు చేజారిపోతాయని ఆయన ఆ లేఖ లో వెల్లడించారు.