తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ లోనే 881 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు మరణించారు. ఇప్పటివరకు 17,357 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 267మంది మృతి చెందారు. ప్రస్తుతం 9008 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇవాళ డిశ్చార్జైనవారు 788 మంది ఉండగా, మొత్తం ఇప్పటివరకు 8082 మంది డిశ్చార్జయ్యారు. మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 36 కరోనా కేసులు, రంగారెడ్డి జిల్లాలో 33, మహబూబ్ నగర్ జిల్లాలో 10 కేసులు, వరంగల్ , మంచిర్యాలలో 9 చొప్పున కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న కేసుల సంఖ్యతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.