ఉత్తరాఖండ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థకు షాకిచ్చింది. తాము కేవలం రోగ నిరోధక శక్తిని పెంచుకునే, జ్వరాన్ని తగ్గించే ఆయుర్వేద ఔషధాల తయారీకి మాత్రమే పతంజలికి అనుమతులు ఇచ్చామని, కరోనైల్ మెడిసిన్ తయారీకి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. దీంతో పతంజలి విడుదల చేసిన కరోనైల్ ఆయుర్వేద ఔషధంపై సర్వత్రా గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఓ వైపు తాము అన్ని అనుమతులు తీసుకునే ఔషధాన్ని తయారు చేశామని, తాము క్లినికల్ రీసెర్చి చేశాకే.. 100 శాతం అనుకూల ఫలితాలు వచ్చాకే.. మెడిసిన్‌ను మార్కెట్‌లో విడుదల చేశామని యోగా గురువు బాబా రాందేవ్ చెప్పారు. అయితే ఆయుష్ మంత్రిత్వ శాఖ మాత్రం తాము ఆ మెడిసిన్ తయారీకి అనుమతులు ఇవ్వలేదని చెప్పడం చర్చనీయాంశమవుతోంది.
పతంజలి సంస్థ విడుదల చేసిన కరోనైల్ మెడిసిన్‌లో ఏయే సమ్మేళనాలు వాడారు, రీసెర్చి ఎక్కడ చేశారు, అందుకు ఏయే నిబంధనలను పాటించారు, ఎంత శాంపిల్ సైజులో ఔషధాన్ని ఇచ్చారు.. తదితర వివరాలను తమకు తెలియజేయాలని మరోవైపు ఇప్పటికే ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలిని ఆదేశించింది. అయితే ఇంతలోనే ఆ శాఖ మళ్లీ ఇలా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ప్రకటన చేయడం గందరగోళానికి దారి తీస్తోంది. అయితే పతంజలికి నిజంగానే ఆయుష్ శాఖ కరోనైల్ మెడిసిన్ తయారీకి అనుమతులు ఇచ్చిందా, లేక నిబంధనలను ఉల్లంఘించి పతంజలి ఆ మెడిసిన్‌ను తయారు చేసి, మార్కెట్‌లోకి విడుదల చేసిందా.. అన్న వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరి ఈ విషయంలో ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.