కార్తీకంలో తులసీ కోట పూజ ఎప్పుడు చేయాలి?

కార్తీకమాసం శివకేశవుల పూజ చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాల్లో శివారాధన చేసేవారికి పుణ్యఫలం చేకూరుతుందని పండితులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది నవంబర్‌ 8,9 తేదీల్లో ఏకాదశి, ద్వాదశి తిథులు వస్తున్నాయి. ఆ రోజుల్లో ఏం చేయాలో తెలుసుకుందాం.. కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశులకు ప్రత్యేకత ఉంది. అందుకే ఈ రెండు తిథుల్లో వైష్ణవ సంబంధమైన పూజలు చేయాలి. ఈ మాసంలో శుక్ల పక్ష ఏకాదశిని ప్రబోధ ఏకదాశి అంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది. ఆషాఢ ఏకాదశి (శయనైకాదశి) నాడు శయనించిన స్వామి (యోగనిద్ర) నుంచి ఈ రోజు మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత

‘ఉత్తిష్ఠోత్తిష్ట గోవింద! త్యజనిద్రాం జగత్పతే,
త్వయిస్తుపే జగత్ సుప్తం ఉత్థితే చోత్థితం జగత్”

అనే ప్రబోధన మంత్రంతో ప్రార్థనచేసి, శ్రీమహావిష్ణువును అర్చించి, ఉపవసించాలి. ఈ రోజున భాగవతంలో “అంబరిషోపాఖ్యానం” చదివినా, విన్నా మేలు జరుగుతుందని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఏకాదశి నాడు విష్ణుమూర్తి క్షీర సాగరం నుంచి బయలుదేరి వచ్చి తనకెంతో ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలో ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. ఆ కారణం చేతనే ఈ రోజున తులసి దగ్గర విశేష పూజలు జరుపుతుండటం ఆచారంగా వస్తోంది. ఈ ద్వాదశినే మధన ద్వాదశి అని కూడా అంటారు. దేవ దానవులు సముద్రాన్ని మధించింది.. కార్తీక శుద్ధ ద్వాదశి నాడని, దానికి గుర్తుగానే ఈ ద్వాదశిని జరుపుకోవడం ఆచారమైందని పెద్దలంటారు. ఈ రోజున కడలిలో శయనించిన విష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశినాడు, లక్ష్మీ, బ్రహ్మలాంటి దేవతలందరితో కలిసి తులసి దగ్గరకు వస్తాడు.

ఆ రోజున సూర్యాస్తమం తర్వాత తులసిని, విష్ణువును పూజించిన దానాది కార్యక్రమాలు చేసే వారికి కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా దీపదానం చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఇంకా కార్తీక ద్వాదశి రోజున తులసిని పూజించడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ఈ రోజున కొన్ని తులసి దళాలను నములుతూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుచేత కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శివ, విష్ణువులతో పాటు తులసీ కోటను కూడా పూజించేవారికి ఈతిబాధలు తొలగి, సకల సంతోషాలు చేకూరుతాయని శాస్త్రప్రవచనం. ఇంకా ఈ రోజుల్లో శైవ, వైష్ణవ క్షేత్రాలను దర్శించుకునే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.

– కేశవ