ఫిబ్రవరి 14నే వాలెంటైన్స్‌ డే ఎందుకు జరుపుకుంటారో.. దానికా పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

-

వాలెంటైన్స్‌ డే వస్తుందంటే చాలు.. ప్రేమికులు ఆ రోజున ఏం చేయాలా..? ప్రేమికుల దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలా ? అని ఆలోచిస్తుంటారు. ఇక ఇంకా ప్రేమకు నోచుకోని వారు, వన్‌సైడ్‌ లవర్స్‌ తమ ప్రేమకు శుభం కార్డు పడాలని ఆ రోజు కోసం వేచి చూస్తుంటారు. అయితే అసలు నిజానికి వాలెంటైన్స్‌ డేకు ఆ పేరు ఎలా వచ్చింది ? ఫిబ్రవరి 14వ తేదీనే ఆ రోజును ఎందుకు జరుపుకుంటారు ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

why February 14th will be celebrated as valetines day and how it got that name

పూర్వం క్లాడియస్‌ అనే రాజు రోమ్‌ను పరిపాలిస్తుండేవాడు. అయితే ఆయన హయాంలో సైనికులు అస్సలు పెళ్లిళ్లు చేసుకోవద్దనే నిబంధన విధించాడు. దీంతో సైనికులు తెగ బాధపడిపోయేవారు. అయితే వాలెంటైన్‌ అనే ఒక సాధువు ఈ విషయం తెలుసుకుని సైనికులకు రహస్యంగా పెళ్లిళ్లు చేయించేవాడు. అయితే ఈ విషయం కాస్తా రాజుకు తెలుస్తుంది. దీంతో ఆ రాజు వాలెంటైన్‌కు మరణశిక్ష విధిస్తాడు. ఇక శిక్షను అమలు పరిచేందుకు ముందు రోజు వాలెంటైన్‌ ఒక రావి ఆకు మీద ప్రేమ సందేశాలను రాస్తాడు. తాను సైనికుల జీవితాల్లో ప్రేమను నింపాలని అనుకున్నానని, అందుకే వాళ్లకు పెళ్లిళ్లు చేశానని, ప్రతి మనిషికీ ప్రేమ కావాలని, ప్రేమ లేకపోతే జీవితమే ఉండదని, ప్రేమను బతికించుకోవాలని.. అతను రావి ఆకు మీద బొగ్గుతో సందేశం రాసి ఆ ఆకును జైలు గది కిటికీ నుంచి బయటకు విసిరేస్తాడు. అనంతరం మరుసటి రోజు ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్‌కు మరణ దండన అమలు పరుస్తారు. ఈ క్రమంలో వాలెంటైన్‌ రాసిన ఆ సందేశాన్ని ప్రజలు చదువుతారు. ఆ తరువాత ఆ సందేశాలే ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందాయి. ఈ క్రమంలో వాలెంటైన్‌ చనిపోయిన రోజునే వాలెంటైన్స్‌ డేగా జరుపుకుంటూ వస్తున్నారు. అదీ.. ఈ దినోత్సవం జరుపుకోవడం వెనుక ప్రచారంలో ఉన్న ఒక కథ. ఇక మరొక కథ చూస్తే…

గ్రీకు దేశాన్ని పరిపాలింటే క్లాడియస్‌ 2 తాను పూజించే 12 మంది దేవతలనే రోమన్లందరూ పూజించాలని అప్పట్లో నిబంధన పెట్టాడు. అయితే వాలెంటినస్‌ అనే సాధువు మాత్రం క్రిస్టియానిటీని నమ్మి జీసస్‌ను ప్రార్థిస్తుంటాడు. దీంతో ఆగ్రహం చెందిన రాజు వాలెంటినస్‌ను జైల్లో పెట్టి అతనికి మరణ దండన విధిస్తాడు. అయితే వాలెంటినస్‌ తన కూతురు జూలియాకు జైలు నుంచే జ్ఞానాన్ని, జీవన సత్యాలను బోధిస్తుంటాడు. ఆమె పుట్టుకతోనే అంధురాలు. ఈ క్రమంలో ఆమె సముపార్జించిన జ్ఞానం ఆమెకు చూపు తెప్పిస్తుంది. అయితే వాలెంటినస్‌ తనను ఉరి తీసే ముందు తన కుమార్తెకు ఓ సందేశం పంపుతాడు. దైవాన్ని నమ్ము, ప్రపంచాన్ని ప్రేమించమని చెబుతాడు. ఆ తరువాత ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటినస్‌ను ఉరి తీస్తారు. అనంతరం అతని సమాధిపై అతని కుమార్తె ఒక బాదం మొక్కను నాటుతుంది. అది గులాబీ రంగులో ఉంటుంది. ఆ తరువాత అదే మొక్క ప్రేమకు చిహ్నంగా మారుతుంది. దీంతో ప్రపంచాన్ని ప్రేమించమని చెప్పిన వాలెంటినస్‌ సందేశానికి గుర్తుగా అతన్ని ఉరి తీసిన రోజైన ఫిబ్రవరి 14వ తేదీని వాలెంటైన్స్‌ డేగా జరుపుకుంటూ వస్తున్నారు. అయితే మొదట చెప్పిన కథ ప్రకారం.. వాలెంటైన్‌ ప్రేమ సందేశాలు రాసిన ఆ రావి ఆకునే తరువాతి కాలంలో హృదయంగా భావించి ప్రేమికులు దాన్ని తమ సందేశాల్లో ఉపయోగించడం మొదలు పెట్టారు. అందుకనే ప్రేమికులు ఎక్కువగా ఎరుపు రంగులో ఉండే హృదయ చిహ్నాలను తమ సందేశాల్లో వాడడం మొదలు పెట్టారని చెబుతారు. అయితే వాలెంటైన్స్‌ డే జరుపుకోవడం వెనుక పైన చెప్పిన రెండు కథలూ ప్రచారంలో ఉన్నప్పటికీ మొదటి కథనే నిజమైందని చాలా మంది నమ్ముతారు..!

Read more RELATED
Recommended to you

Latest news