ఈ ఏడాది క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్న కెప్టెన్ అతనే…!

ఈ రోజుల్లో క్రికెట్ కెప్టెన్ అంటే…? అసలు దేశవాళి జట్టుకి కెప్టెన్ అయితేనే చాలా వరకు హడావుడి చేస్తూ ఉంటారు. వాళ్ళదే పెత్తనం అంటూ చెలాయిస్తూ ఇతర ఆటగాళ్లను కనీసం లెక్క చేయకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా వరకు మనం క్రికెట్ లో కెప్టెన్ ని ఇలానే చూస్తూ ఉంటాం. చిన్న తప్పు చేస్తే ఆటగాళ్లను నానా మాటలు అంటూ ఉంటారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా వాళ్ళ మీద అనవసర సాధింపు ఉంటుంది. కాని ఆ ఆటగాడు మాత్రం సారధి అంటే అలా కాదు ఉండాల్సింది. ఆటగాడికి స్నేహితుడిలా ఉండాలని నిరూపించాడు.

అతని పేరే కేన్ విలియమ్సన్. న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ అతను. శాంతానికి మారు పేరు ఈ యువ ఆటగాడు. ఎప్పుడో 9 ఏళ్ళ క్రితం అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన కేన్ ఆ తర్వాత బెస్ట్ బ్యాట్స్మెన్ గా మారడంతో అతన్ని కెప్టెన్ ని చేసారు. అప్పటి నుంచి టీం ని ముందు ఉండి నడిపిస్తున్న విలియమ్సన్… ఈ ఏడాది బెస్ట్ కెప్టెన్ అయ్యాడు. ఎలా అనేది చూద్దాం. ప్రపంచ కప్పు ఫైనల్లో పట్టిన క్యాచ్‌ను చేజార్చడమే కాకుండా, ఎదుటి జట్టుకు ఆరు పరుగులు ధారపోస్తే కూడా బౌల్ట్ ని ఒక్క మాట కూడా అనకుండా, అదే బౌల్ట్‌లో నైతిక స్థైర్యాన్ని నింపాడు.

బౌల్ట్‌తోనే కీలకమైన ఇన్నింగ్స్ చివరి ఓవర్, టై అయిన సూపర్ ఓవర్.. వరుసగా రెండు ఓవర్లను వేయించాడు. లక్ష్యం ఛేదించకుండా ఇంగ్లండును కంట్రోల్ చేసాడు అంటే అది కేవలం కెప్టెన్ ఇచ్చిన మద్దతే. కెప్టెన్ అంటే పెత్తందారీ కాదు, స్ఫూర్తినింపే ‘మెంటార్’ అని నిరూపించాడు. ఓటమికి కారణాల్లో క్రికెట్ రూల్స్ నిందించకుండా, కాలాన్ని తప్పుబట్టి అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆ స్థాయిలో ఓటమి ఎదురైనా సరే ఎక్కడా కుంగిపోకుండా ధైర్యంగా మైదానం నుంచి బయటకు వచ్చాడు. అందుకే ఈ ఏడాది బెస్ట్ కెప్టెన్ అయ్యాడు.