పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా హబీబ్‌పూర్ ప్రాంతంలో ఉన్న గిరిజ సుందరి విద్యామందిర్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న బాలురను, బాలికలను వేర్వేరు రోజుల్లో స్కూల్‌కు రమ్మన్నారు.
సమాజంలో ఏది మంచి, ఏది చెడు.. ఏం చేయకూడదు, ఏం చేయాలి.. ఎలా ప్రవర్తించాలి..? అన్నది మనం పిల్లలకు నేర్పిస్తేనే కదా.. వారు మంచి నేర్చుకుని సక్రమ మార్గంలో నడుస్తారు. ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంటుందో, పాఠశాలల్లో ఉపాధ్యాయుల పాత్ర కూడా అంతే ఉంటుంది. అలాంటప్పుడు వారే పిల్లలను తప్పుదోవ పట్టించేట్లుగా వ్యవహరిస్తే ఇక పిల్లలు మంచేది, చెడేది.. అని తెలుసుకుంటారు చెప్పండి.. బెంగాల్‌లో ఓ ప్రభుత్వ స్కూల్ కూడా ఇదే చేసింది. లైంగిక వేధింపుల పట్ల పిల్లల్లో అవగాహన కల్పించి.. వారిలో చైతన్యం పెంచాల్సింది పోయి.. వారిలో ఆ అంశం పట్ల మరింత భయాన్ని పెంచే విధంగా ప్రవర్తించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా హబీబ్‌పూర్ ప్రాంతంలో ఉన్న గిరిజ సుందరి విద్యామందిర్ ప్రభుత్వ పాఠశాలలో ఈ మధ్య బాలబాలికలకు ఒక కొత్త రూల్ పెట్టారు. అదేమిటంటే.. పాఠశాలలో ఉన్న బాలురను, బాలికలను వేర్వేరు రోజుల్లో స్కూల్‌కు రమ్మన్నారు. బాలికలను సోమ, బుధ, శుక్ర వారాల్లో, బాలురను మంగళ, గురు, శనివారాల్లో స్కూల్‌కు రావాలన్నారు. అంటే వారంలో ఎవరైనా సరే కేవలం 3 రోజులు మాత్రమే స్కూల్‌కు వెళ్తారన్నమాట. దీంతో బాలురు, బాలికలు వేర్వేరుగా ఉంటారని, లైంగిక వేధింపులు తగ్గుతాయని ఆ స్కూల్ ఉపాధ్యాయులు భావించారు. అందుకే వారిని అలా వేర్వేరు రోజుల్లో రమ్మన్నారు.
అయితే ఆ స్కూల్ పెట్టిన ఈ తలతిక్క రూల్ తెలిసిన పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ నిర్ణయాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. ఇక ఈ విషయం విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ దృష్టికి వెళ్లడంతో ఆయన ఈ ఘటనపై విచారణకు సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలబాలికల మధ్య ఇలాంటి వివక్ష చూపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏది ఏమైనా.. సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య ఇలాంటి భేదాలు ఉన్నంత కాలం మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉంటాయి. సమాజంలో ఈ విషయమై మార్పు వస్తే తప్ప ఆ వేధింపులు ఆగవు..!