పవర్ స్టార్ పవన కళ్యాణ్ సినిమాల్లోకీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో వచ్చే ఎన్నికల వరకూ మళ్లీ పవన్ సినిమాలు చేసుకోవచ్చు అంటూ కథనాలు వచ్చాయి. తాజాగా ఈ కథనాలపై మరో అడుగు ముందకు పడింది. త్వరలో పవన్ కళ్యాణ్ -మైత్రీ మూవీ మేకర్స్ మధ్య ఓ చర్చలు జరగనున్నాయని క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలిసింది. ఆ భేటితో పవన్ సినిమా చేస్తాడా? లేదా? అన్న దానిపై క్లారిటీ వస్తుందంటున్నారు. ఇప్పటికే పవన్ అజ్ఞాతవాసి సినిమా టైమ్ లో సదరు సంస్థ నుంచి కొంత మొత్తం అడ్వాన్స్ గా తీసుకున్నాడు. కానీ తర్వాత ప్రజాక్షేత్రంలో బిజీ అవ్వడంతో మైత్రీకి సినిమా చేయడం కుదరలేదు.
అప్పటి నుంచి సదరు సంస్థ ఏదో ఒక రోజు పవన్ తమతో సినిమా చేస్తాడని ఆశిస్తున్నారు. కానీ ఇప్పటివరకూ జరగలేదు. ఇటీవలే ఎన్నికలు అయిపోయాయి కాబట్టి సినిమా చేసే అవకాశం ఉందని స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పవన్ మైత్రీ తో జరిగే సమావేశంలో ఎలంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే మరోపక్క ఇప్పటికే పవన్ తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేసాడని ఇంకొంత మంది వాదన. ఇక పవర్ స్టార్ అభిమానుల నుంచి సినిమాలు చేయాలని ఒత్తిడి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులను దృష్టిలో పెట్టుకుని వాళ్లకు అనుకూలంగానే తన నిర్ణయాలు ఉంటాయని కొంత మంది ఆశిస్తన్నారు.
చిరంజీవి కూడా ఏ రంగంలో ఉన్నా తనకు జీవితాన్ని ఇచ్చిన వృత్తిని మాత్రం ఎప్పటికీ వదలొద్దని పబ్లిక్ గానే చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ నిర్ణయం తీసుకునే ముందు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ హైదరాబాద్ లోనే ఉన్నారు. ఎన్నికల తర్వాత ఫ్యామిలీని అమరావతి నుంచి హైదరాబాద్ కు షిప్ట్ చేసారు. ఇటీవలే సైరా సినిమా వివరాలను చిత్ర నిర్మాత రామ్ చరణ్ ని అడిగి తెలుసుకున్నట్లు మెగా కాంపౌండ్ వర్గాల నుంచి తెలిసింది.