కరోనా.. కోవిడ్ 19.. ఎలా పిలిచినా సరే.. ఈ మహమ్మారి ప్రపంచానికి తెచ్చిన నష్టం అంతా ఇంతా కాదు. దీని వల్ల ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మళ్లీ ఎప్పటికీ పరిస్థితి బాగు పడుతుందో అర్థం కావడం లేదు. మరోవైపు అనేక మంది దీని వల్ల కన్నవారిని, కుటుంబ సభ్యులను, స్నేహితులను పోగొట్టుకున్నారు. ఎంతో మందికి కరోనా తీరని శోకాన్ని మిగిల్చింది. అయితే కరోనా చాలా మందికి ఇంతటి భారీ నష్టాన్ని కలిగించినా.. అతనికి మాత్రం ఆ పేరు బాగా కలసి వచ్చింది. ఇంతకీ అతనెవరు ? అతని స్టోరీ ఏమిటంటే…
కేరళలోని కొట్టాయంలో కలతిప్యాడీ ప్రాంతంలో జార్జ్ అనే వ్యక్తి 7 ఏళ్ల కిందట ఓ ఇంటీరియర్ డిజైనింగ్ ఐటమ్స్ షాప్ పెట్టాడు. అందులో మొక్కలు, కుండీలు, ల్యాంపులు, ఇతర గృహాలంకరణ వస్తువులను విక్రయిస్తున్నాడు. అయితే అతని షాప్ పేరు ఏంటో తెలుసా.. కరోనా.. అవును నిజమే. 7 ఏళ్ల కిందటే దానికి ఆ పేరు పెట్టాడు. కానీ ఇప్పుడు కరోనా ఇలా వస్తుందని అతను అప్పట్లో అనుకోలేదు.
నిజానికి కరోనా అంటే లాటిన్ భాషలో క్రౌన్ అని అర్థం వస్తుంది. అంటే కిరీటం అని అర్థం. పేరు బాగుందని అతను తన షాప్‌కు అదే పేరు పెట్టాడు. అయితే కరోనా అనే పేరు వల్ల అతని షాప్‌కు ప్రస్తుతం గతంలో కన్నా ఇప్పుడు కస్టమర్లు చాలా మంది పెరిగారని అంటున్నాడు. కరోనా అనే బోర్డు చూసి చాలా మంది తన షాప్‌కు వచ్చి వస్తువులను కొంటున్నారని చెప్పాడు. ఏది ఏమైనా.. అతనికి మాత్రం కరోనా లాభాలనే తెచ్చి పెడుతోంది. నిజమే కదా..!