గోవాకు వెళ్తున్నారా..? జెల్లీ ఫిష్‌ల‌తో జాగ్ర‌త్త‌.. 2 రోజుల్లో 90 మంది బాధితులు..

గోవాలో అనేక బీచ్‌లు ఉంటాయి. ఏ బీచ్‌కు వెళ్లినా స‌ముద్ర తీర‌పు అల‌లు, ప్ర‌కృతిని చూస్తూ ప‌ర్యాట‌కులు ఎంతో సేపు ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఇక క‌రోనా నేప‌థ్యంలో అక్క‌డ ఎలాంటి ఆంక్ష‌లు లేవు. అందువ‌ల్ల ప‌ర్యాట‌కులు ఇప్పుడు అక్క‌డికి నెమ్మ‌దిగా వ‌స్తున్నారు. అయితే గత 2 రోజులుగా అక్క‌డి బీచ్‌ల‌లో జెల్లీ ఫిష్‌లు రాజ్య‌మేలుతున్నాయి. పర్యాట‌కుల‌ను కుడుతున్నాయి. దీంతో బీచ్‌లో తిర‌గాలంటేనే వారు జంకుతున్నారు.

jelly fish are biting in goa 90 cases in 2 days

గోవాలోని బాగా-క‌లాంగుటె బీచ్‌లో 55 జెల్లీ ఫిస్ కుట్టిన కేసులు న‌మోదు కాగా, కండోలిమ్ సింకెరిమ్ బీచ్‌లో 10 కేసులు, ద‌క్షిణ గోవా బీచ్‌లో 25 కేసులు న‌మోద‌య్యాయి. 2 రోజుల్లోనే మొత్తం 90కి పైగా జెల్లీ ఫిష్ కుట్టిన కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ప‌ర్యాట‌కులు ఆందోళ‌న చెందుతున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఇలా జెల్లీ ఫిష్‌లు కుట్ట‌డమేమిటి ? అని విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే ప‌ర్యాట‌కులకు స‌హాయం అందించేందుకు బీచ్‌ల వ‌ద్ద దృష్టి లైఫ్ సేవ‌ర్స్‌ను ఏర్పాటు చేశారు. వారు జెల్లీ ఫిష్‌లు కుట్టిన బాధితుల‌కు స‌హాయం అందిస్తున్నారు. వారికి ప్ర‌థ‌మ చికిత్స చేస్తున్నారు. బాగా బీచ్‌లో ఒక వ్య‌క్తికి జెల్లీ ఫిష్ కుట్ట‌గా అత‌నికి ఛాతిలో తీవ్ర‌మైన నొప్పి వ‌చ్చింది. ఆక్సిజ‌న్ అంద‌క ఇబ్బంది ప‌డ్డాడు. దీంతో అత‌న్ని వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

ఇక సాధార‌ణంగా జెల్లీ ఫిష్ లు కుట్టినా మ‌నుషుల‌కు ఏమీ కాదు. కానీ వాటిల్లో రెండు ర‌కాలు ఉంటాయి. టాక్సిక్‌, నాన్ టాక్సిక్‌. నాన్ టాక్సిక్ జెల్లీ ఫిష్‌లు కుడితే కుట్టిన చోట ఇర్రిటేష‌న్ వ‌స్తుంది. వేడి నీటితో క‌డిగితే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. త‌రువాత ప్ర‌థ‌మ చికిత్స చేయ‌వ‌చ్చు. కానీ టాక్సిక్ జెల్లీ ఫిష్‌లు కుడితే చాలా అరుదైన సంద‌ర్భాల్లో మ‌నుషుల‌కు ప్రాణ హాని క‌లుగుతుందని అంటున్నారు. ఈ క్ర‌మంలో గోవా బీచ్‌ల‌లో జెల్లీ ఫిష్‌లు హ‌డ‌లెత్తిస్తుండ‌డం ప‌ర్యాట‌కుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.