ఇంద్ర జాత్ర లేదా యెన్.. నేపాల్ ప్రజలు ఘనంగా జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగలో వాళ్లు ఎవరిని పూజిస్తారో తెలుసా? ఓ అమ్మాయినే దేవతగా పూజిస్తారు. ఆమెనే ప్రత్యక్ష దేవతా అని పిలిస్తున్నారు. ఇంద్ర జాత్ర అనే పండుగ దాదాపు ఎనిమిది రోజుల పాటు జరుగుతుంది. సాంప్రదాయ నృత్యాలు, ఆటాపాటలతో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇంద్రుడిని కూడా ఈ సమయంలో వాళ్లు పూజిస్తారు. ఇటీవలే ఖాట్మండ్ లో ఈ పండుగకు అంకుర్పారణ జరిగింది. ఈ ఉత్సవాల్లో రెండు రకాల పండుగలు ఉంటాయి. ఒకటి ఇంద్ర జాత్ర కాగా.. మరోటి కుమారి జాత్ర.
ఇంద్ర జాత్రలో భక్తులు దేవతలకు పూజలు నిర్వహించగా… కుమారి జాత్రలో ప్రత్యక్ష దేవత కుమారి రథయాత్ర ఉంటుంది. ప్రత్యక్ష దేవతగా నేవర్ తెగకు చెందిన ఓ బాలికను ప్రతి సంవత్సరం పూజిస్తారు. కుమారి దేవతగా ఎంపిక చేయడం కోసం చాలా మంది అమ్మాయిలకు కఠిన పరీక్షలు నిర్వహిస్తారు. అందులో నెగ్గిన వారినే కుమారి దేవతగా ఎంపిక చేస్తారు. ఈసారి త్రిష్ణ శక్య అనే అమ్మాయి ప్రత్యక్ష దేవతా పూజింపబడింది. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆ కుమారి దేవత బయటికి రాదు. ఈ పండుగ సమయంలోనే 13 రోజులు మాత్రమే బయటికి వస్తుంది. ఆ కుమారి దేవతను సేవకులు రథంపై ఊరేగిస్తారు. నేపాల్ దేవత తలేజు భవానీ అమ్మవారికి కుమారి దేవత పూజలు చేస్తుంది. దీంతో అమ్మవారి శక్తులన్నీ ఆ ప్రత్యక్ష దేవత శరీరంలోకి సంక్రమిస్తాయని నేపాలీయుల నమ్మకం. అనంతరం ఆ కుమారి దేవతకు పూజలు నిర్వహిస్తారు.