హార్రర్ సినిమాలంటే ఉన్న ఇష్టంతో అతను అన్నాబెల్ కమ్స్ హోమ్ మూవీని చూసేందుకు థియేటర్ వెళ్లాడు. అందులో ఉన్న హార్రర్ సీన్లను చూడలేక హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు.
అన్నాబెల్ సిరీస్ లో వచ్చిన అన్నాబెల్, అన్నాబెల్ క్రియేషన్, ది కంజూరింగ్, కంజూరింగ్ 2.. చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. అయితే అదే సిరీస్‌లో ఇప్పుడు తాజాగా అన్నాబెల్ కమ్స్ హోమ్ అనే మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కేవలం హార్రర్ సినిమాలంటే బాగా ఇష్టపడే వారికే ఈ సినిమా నచ్చుతుంది. అయితే అదే ఆసక్తితో ఓ పెద్దాయన ఈ సినిమాను చూసేందుకు థియేటర్‌కు వెళ్లాడు. కానీ సినిమా చూస్తూ హఠాత్తుగా గుండె పోటు రావడంతో థియేటర్‌లోనే చనిపోయాడు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…
బెర్నార్డ్ కానింగ్ అనే ఓ 77 ఏళ్ల వృద్ధుడు బ్రిటన్ నుంచి థాయ్‌లాండ్‌కు పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వచ్చాడు. అయితే అతను తాజాగా రిలీజైన అన్నాబెల్ కమ్స్ హోమ్ చిత్రాన్ని చూసేందుకు అక్కడే ఓ థియేటర్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో సినిమా అయ్యాక పక్కవారు బెర్నార్డ్‌ను గమనించి అతను పడిపోయినట్లు నిర్దారించుకుని వెంటనే థియేటర్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు పోలీసులను పిలిపించి వారి సహాయంతో బెర్నార్డ్‌ను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు బెర్నార్డ్‌ను పరీక్షించి అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్దారించారు.
అయితే బెర్నార్డ్ మూవీ చూస్తూ ఉండగా అందులో వచ్చే భయానక సన్నివేశాలను చూసి తట్టుకోలేకపోయాడని, ఈ క్రమంలో అతనికి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఏ విషయమూ పోస్టు మార్టం తరువాతే తెలుస్తుందని వారు చెప్పారు. కాగా గతంలోనూ ఇలా హార్రర్ మూవీలు చూస్తూ పలువురు మృతి చెందిన సంఘటనలు జరగ్గా, ఇప్పుడు తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంతైనా గుండె జబ్బులు ఉన్నవారు హార్రర్ మూవీలను చూడకపోవడమే మంచిది..!