ఆకాశం నుంచి కింద పడ్డ వస్తువు.. ఏలియన్స్‌ వచ్చారా..?

రాజస్థాన్‌లోని జలోర్‌ జిల్లా సంచోరె టౌన్‌ పరిసరాల్లో ఆకాశం నుంచి ఒక ఉల్క వేగంగా కిందకు వచ్చి పడింది. శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ ఉల్క బరువు సుమారుగా 2.80 కిలోగ్రాములు ఉంది. ఆ ఉల్క భూమిపై పడినప్పుడు భూమిలో ఒక అడుగు లోతు గుంత కూడా ఏర్పడింది. కాగా ఉల్క కింద పడినప్పుడు ఆ ప్రాంతమంతా బాంబులు పేలినట్లు పెద్దగా శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందజేశారు. చుట్టు పక్కల సుమారుగా 2 కిలోమీటర్ల మేర నివాసం ఉన్న ప్రజలు ఆ భారీ శబ్దాన్ని విన్నారు.

Meteorite like object fell from sky in rajasthan

స్థానిక సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ భుపేంద్ర యాదవ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ఉల్కను పరిశీలించారు. అది చాలా సేపు వేడిగా ఉందని, అది చల్లారాక దాన్ని ప్యాక్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించామని తెలిపారు. ఆ ఉల్క ఆకాశం నుంచి పడినట్లు నిర్దారణ అయిందని, దాన్ని ప్రస్తుతం భద్రంగా నిల్వ చేశామని, సంబంధిత అధికారులకు పరీక్షల నిమిత్తం దాన్ని పంపిస్తామని తెలిపారు. ఇక సంచోరెలో ఉన్న ఓ జ్యువెల్లర్‌ షాపుకు చెందిన ప్రైవేటు ల్యాబ్‌లో ఆ ఉల్కను పరీక్షించారు. ఈ క్రమంలో అందులో పలు లోహాలు ఉన్నట్లు గుర్తించారు. అందులో 10.23 శాతం నికెల్‌, 85.86 శాతం ఇనుము, 0.5 శాతం ప్లాటినం, 0.78 శాతం కోబిట్‌, 0.02 శాతం జర్మేనియం, 0.01 శాతం ఆంటిమొని, 0.01 శాతం నియోబియం, మరో 3.02 శాతం ఇతర లోహాలు ఉన్నట్లు గుర్తించారు.

ఇదే విషయమై అహ్మదాబాద్‌, జైపూర్‌లలోని జియోగ్రాఫికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన జియాలజిస్టులను అధికారులు సంప్రదించారు. వారికి సదరు ఉల్కను పరిశోధనల నిమిత్తం పంపించనున్నారు. అయితే రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఫిబ్రవరిలో, జూలై 2019లో నంగ్ల కసోటా గ్రామంలోనూ ఇదే తరహాలో అప్పట్లో ఉల్కలు పడ్డాయి. ప్రస్తుతం అదే రాజస్థాన్‌లో మళ్లీ ఇంకో చోట ఉల్క పడింది. దీంతో నెటిజన్లు ఈ విషయమై భిన్నంగా స్పందిస్తున్నారు. ఏలియన్స్‌ భూమి మీదకు వచ్చారని, అందుకు ఇదే నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు.