గ్రామాల్లో ఉన్న చెరువుల్లో మత్స్యకారులు పట్టేంతవరకు చేపలు పట్టి.. ఇక తమ వాళ్ల కాదని చెప్పి చెరువును గ్రామస్తులకు అప్పచెప్తారు. దీంతో ఊరి ప్రజలు.. చెరువును లూటీ చేస్తారు. అంతే చెరువులోకి దిగి.. వాళ్ల ఇష్టం వచ్చినట్టు చేపలు పట్టుకుంటారు. కానీ.. ఆ ఊరిలో ఉన్న చెరువులో మత్స్యకారులు చేపలు పడుతుండగానే లూటీ చేశారు గ్రామస్థులు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం గణపవరం గ్రామంలో చోటు చేసుకున్నది.
గణపవరంలో ఉన్న చెరువు సుమారు 200 ఎకరాల్లో విస్తరించి ఉందట. ఆ ఊళ్లోని మత్స్యకారులకు ఆ చెరువే ఆధారం. ఆ చెరువులో చేపలను పెంచుకొని.. వాటిని అమ్ముకొని జీవనం సాగిస్తారు అయితే.. ఇవాళ ఒక్కసారిగా.. చుట్టుపక్కన గ్రామాల ప్రజలు అంతా మూకుమ్మడిగా ఆ చెరువుకు లూటీ చేశారు. ఆ చెరువులో బాగా చేపలు ఉన్నాయని.. అందుకే చెరువు లూటీ పోయిందని ఎవరో అసత్య ప్రచారం చేశారు. దీంతో ఆ ఊరుకు చుట్టుపక్కన ఉన్న గ్రామాల ప్రజలంతా ఆ చెరువు మీద విరుచుకుపడ్డారు.
ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ మత్స్యకారులు వెంటనే పోలీసులుకు సమాచారం అందించడంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోయారు. చివరకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పడంతో జనాలంతా అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.