అవును.. మీరు నోరెళ్లబెట్టడం మాత్రం ఖాయం. ఎందుకంటే మీరు పైన ఫోటోలో చూస్తున్న షూ ధర 123 కోట్ల రూపాయలు నమ్మరా? మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది నిజం. ఎహె.. ఊరుకోండి. 123 రూపాయలు పెట్టి కొనడానికే 123 సార్లు ఆలోచిస్తాం. అటువంటిది 123 కోట్ల రూపాయలు పెట్టి షూ కొనడమేంది. దాన్నేమన్నా వజ్రాలు, వైడూర్యాలతో చేశారా ఏంటి.. అని అంటారా? అయ్యో.. పైనుంచి తథాస్తు దేవతులు తాథాస్తు అన్నారు. అందుకేనేమో.. ఆ షూను నిజంగా వజ్రాలు, వైడూర్యాలతో తయారు చేశారు.
రెండు 15 క్యారెట్ల డీ ఫ్లాలెస్ డైమండ్స్ తో ఈ షూను తయారు చేశారు. అంతే కాదు.. వందకు పైగా వజ్రాలు పొదిగాయి. షూ కోటింగ్ అంతా బంగారంతోనే. ఇప్పుడు చెప్పండి ఈ షూకు అంత ధర ఉంటుందో.. ఉండదో.. ఈ షూను తయారు చేయడానికి దాదాపు 9 నెలలు పడుతుందట.
మరి.. ఇంత ఖరీదైన షూ ఎందుకు తయారు చేశారు. ఎవరు తయారు చేశారు.. అంటారా? దుబాయ్ కి చెందిన జాదా దుబాయ్ అనే కంపెనీ తయారు చేసింది. ఇక.. ఈ షూను రేపు అంటే బుధవారం(సెప్టెంబర్ 26న) బుర్జ్ అల్ అరబ్ సెవెన్ స్టార్ హోటల్ లో ఆవిష్కరించనున్నారు. ఈ షూ లాంచింగ్ ఈవెంట్ కు దాదాపు 50 మంది అతిథులు హాజరవుతారట. లాంచింగ్ ఈవెంట్ తర్వాత ఈ షూ అమ్మకాలు ప్రారంభిస్తారట.
ఇక.. ఈ షూ ప్రస్తుతం ఎన్నో రికార్డులను సాధించింది. ఇదివరకు డెబ్బీ వింగమ్ హై హీల్స్ మాత్రమే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూగా రికార్డుకెక్కంది. దాని ధర 109 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ షూ డెబ్బీ వింగమ్ రికార్డును తిరగరాసింది.