ఈసారి దీపావళి స్వాతి నక్షత్రంతో కూడుకున్నది. స్వాతి నక్షత్రంతో ఉన్నరోజు లక్ష్మీపూజ చేస్తే విశేష ఫలితం వస్తుందని శాస్ర్తాలు పేర్కొన్నాయి. ఈసారి దస్త్రం పూజ, లక్ష్మీ పూజ ఏయే సమయాల్లో చేయాలో పంచాంగంలో పేర్కొన్న సమయాల ప్రకారం..
శుభముహుర్తం: దస్త్రం పెట్టడానికి బుధవారం ఉదయం 10-35 ని॥ నుంచి 11.45 వరకు లేదా సాయంత్రం చేయాలనుకునేవారు 7.15 నుంచి 9.20 మధ్య చేసుకోవచ్చు.
ధనలక్ష్మీ పూజలు: బుధవారం సాయంత్రం 6.15 నుంచి 7.45 మధ్య చేసుకోవచ్చు. లేదా వృషభలగ్నంలో పూజించుకోవచ్చు. ఇక కొందరు నిశీధ సమయంలో రాత్రి 11.30- 12 మధ్య ధనలక్ష్మీ పూజ చేస్తే విశేష ఫలితం లభిస్తుందని శాస్ర్తాల్లో ఉంది.
లక్ష్మీపూజ విధానం: సంక్షిప్తంగా పరిశీలిస్తే.. లక్ష్మీపూజ చేయడానికి ఇరువైపుల ఏనుగులు ఉన్న ఫోటో/ వెండి, బంగారు ఎవరి శక్తిని అనుసరించి వారు రూపులను ఏర్పాటుచేసుకోవాలి. పీఠం మీద శుభ్రమైన కొత్త వస్త్రం వేసి బియ్యం పోసి కలశం ఉంచి అలంకరణ చేయాలి. రూపాయి/ఐదు రూపాయిల బిల్లలు, నోట్లు ఉంచి పూజా ద్రవ్యాలతో అర్చించాలి. వారివారి సంప్రదాయాలను బట్టి పూజచేసుకోవాలి. లక్ష్మీదేవికి ప్రీతి కలగలాంటే శాస్త్రం ప్రకారం నారయణడు/వేంకటేశ్వరస్వామిని లేదా విష్ణుమూర్తిని కూడా అవాహనం చేసి పూజచేయాలి. అప్పుడే అమ్మ సంతోషిస్తుంది. ఇక పూజ ద్రవ్యాలు పరిశీలిస్తే..
మారేడు, తామర, మల్లే, గులాబి వంటి పూలతో అర్చిస్తే మంచిది. దక్షిణావృత శంఖం ఉంటే పూజలో పెట్టుకోండి. బంగారం, వెండి వంటి లక్ష్మీరూపాలను అమ్మవారి అలంకరణలోఉపయోగించాలి. సుగంధ ద్రవ్యాలు, ధూపంతో పూజగది వాసనలు వెదజల్లే విధంగా ఉంచుకోవాలి. బజారులో కొన్న స్వీట్లు తెచ్చినా మీ ఇంట్లో శుచిగా, శుభ్రంగా తయారుచేసిన ఏదైనా మధుర పదార్థం అమ్మవారికి నివేదన చేస్తే విశేష ఫలితం వస్తుంది. బంధు, మిత్రులను పూజకు ఆహ్వానించి అందరిని ప్రేమతో ఆదరించి, వారివారి శక్తానుసారం బహుమానాలు, ప్రసాదాలు వితరణ చేయాలి. పూజ అనంతరం పేదలకు ప్రసాదాన్ని పంచడం మంచి ఫలితం ఇస్తుంది. తర్వాత బాణాసంచ కాల్చాలి. ఈ విధంగా పూజచేసుకుంటే ఏడాదంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరనివాసం చేసుకుంటుంది.