శ్రీరామనవమి : రాత్రిపూట రామకళ్యాణం ఎక్కడ చేస్తారో మీకు తెలుసా ?

-

శ్రీరాముడంటే భక్తులందరికీ ప్రీతి. ఇటు వైష్ణవ భక్తులు, శైవుల, శాక్తేయులు ఇలా అందరూ ఆరాధించే సకల గుణ సంపన్నుడు శ్రీజగదభిరాముడు. ఆయన కళ్యాణాన్ని తెలుగునాట ఏటా చైత్ర శుద్ద నవమినాడు అభిజిత్‌ లగ్నంలో చేయడం సంప్రదాయం. కానీ తెలుగునాట ఒక్క పుణ్యక్షేత్రంలో రాత్రిపూట శ్రీరామ కళ్యాణం నిర్వహిస్తారు ఆ విశేషాలు తెలుసుకుందాం….

నవమి నాడు రామకళ్యాణం !

శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించడం తెలుగునాట ఆనవాయితీ. దానికి పునాది భద్రాచలంలో ఏర్పడిందని పండితులు చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని మరో రామక్షేత్రమైన ఒంటిమిట్టలో దీనికి కాస్త విభిన్నమైన సంప్రదాయం కనిపిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా చతుర్దశినాటి రాత్రి రాములోరి కల్యాణం జరుగుతుంది. ఆ ఒంటిమిట్ట గురించిన విశేషాలు తెలుసుకుందాం..

రాముడు అయోధ్యలో జన్మించినా వనవాసంలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణం చేశారని అంటారు. అందుకే శ్రీలంక వరకూ దక్షిణభారతం పొడవునా రామాయణ ఘట్టాలకి సంబంధించిన క్షేత్రాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒంటిమిట్ట కూడా ఒకటి. ఒంటిమిట్టకు ఏకశిలా నగరం అన్న పేరు ఉంది. ఆ ఏకశిలకు దగ్గర్లోనే మృకండుడు అనే మహర్షి తపస్సు చేసుకునేవారట. రాములవారు అరణ్యవాసంలో భాగంగా అటు సంచరిస్తూ కొద్ది రోజులు మృకండునికి రక్షణగా ఇక్కడ ఉన్నారని స్థలపురాణం చెబుతోంది. రాములవారు ఇక్కడ నిలిచిన సమయంలోనే సీతాదేవికి విపరీతమైన దప్పిక కలిగిందట. అప్పుడు రామచంద్రుడు తన బాణాన్ని పాతాళంలోకి సంధించగా… మంచినీట ఊరిందని చెబుతారు. అదే ఈనాడు రామతీర్థంగా పిలుచుకునే చెరువని, రాములవారు నిలబడిన చోటే కోదండరామాలయాన్ని నిర్మించారని భక్తుల నమ్మకం. ఏకశిలకీ రామునికీ మధ్యగల అనుబంధం గురించి విజయనగర రాజులకు తెలియడంతో…. ఒంటడు, మిట్టడు అనే స్థానిక బోయల సాయంతో ఇక్కడ ఆలయాన్ని నిర్మింపచేశారట. అందుకనే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అన్న పేరు స్థిరపడిందని ఇక్కడి స్థానికులు చెప్తారు.

 ఆలయ విశేషాలు

ఒంటిమిట్ట ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాలు మూడూ ఒకటే శిలలో చెక్కడం విశేషం. ప్రతి రామాలయంలోనూ కనిపించే ఆంజనేయస్వామి విగ్రహం ఈ ఆలయంలో కానరాకపోవడం మరో విచిత్రం. రాములవారు ఆంజనేయుని కలవక ముందే ఇక్కడకు వచ్చారనీ… అందుకే ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉండదని చెబుతుంటారు. శతాబ్దాలుగా ఒంటిమిట్ట రామాలయం భక్తులకు పుణ్యతీర్థంగా ఉండేది.

రాత్రిపూట కళ్యాణం చంద్రుడికిచ్చిన వరం !

రాములోరి కళ్యాణం సాధారణంగా అన్నిచోట్ల నవమి నాడు అభిజిత్‌ లగ్నంలో అంటే సుమారు 12 నుంచి  ఒంటిగంట మధ్య నిర్వహిస్తారు.  కానీ ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా చతుర్దశి రాత్రివేళ కల్యాణాన్ని నిర్వహించడం ఒక ఎత్తు. పగటివేళ తాను రామకల్యాణాన్ని చూడలేకపోతున్నానని బాధపడుతున్న చంద్రుని ఊరడించేందుకు, రాములవారు ఇక్కడ రాత్రివేళ కల్యాణం జరిగేలా వరాన్ని ఒసగారని ఒక గాథ ప్రచారంలో ఉంది. మరో కథ ప్రకారం చంద్రవంశజులైన విజయనగరరాజులు తమ కులదైవానికి తృప్తికలిగేలా… రాత్రివేళ కల్యాణాన్ని జరిపించే ఆచారాన్ని మొదలుపెట్టారని చెబుతారు. కారణం ఏదైనా ఇతర రామాలయాలకు భిన్నంగా ఒంటిమిట్టలో రాములోరి కల్యాణం చతుర్దశి నాటి రాత్రి, పౌర్ణమి రోజున రథోత్సవం ఘనంగా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడంతో… ఒంటిమిట్టకు అక్కడి ప్రభుత్వం మరింత ప్రాధాన్యతను ఇస్తూ దీన్ని మరో భద్రాదిగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. 2015 నుంచి ప్రభుత్వ లాంఛనాలతో, టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు.

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news