ఊపిరితిత్తుల్లో అధిక రక్తపోటును గుర్తించే పరీక్ష..

-

ఊపిరితిత్తులకు వచ్చే సమస్యల్లో పల్మనరీ హైపర్‌టెన్షన్‌ కూడా ఒకటి.. అంటే ఊపిరితిత్తుల ధమనుల్లో అధిక రక్తపోటు.ఇది అరుదైన సమస్యే కావొచ్చు. కానీ ప్రాణాల మీదికి తెస్తుంది. దీని తీవ్రతను, ప్రాణాపాయం ఉందా లేదా అని గుర్తించటానికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిశోధకులు కొత్త రక్త పరీక్షను గుర్తించారు. ఆ పరీక్ష ఏంటో, రిజల్ట్‌ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..

lungs | ఊపిరితిత్తులు
lungs | ఊపిరితిత్తులు

ఈ కొత్తరం పరీక్ష.. సంప్రదాయ పరీక్షల కన్నా ఇది మరింత మెరుగ్గా ఫలితం చూపుతున్నట్టు ప్రాథమిక అధ్యయనాలు చెబుతున్నాయి. దెబ్బతిన్న కణాల నుంచి వెలువడే డీఎన్‌ఏ పోచలను గుర్తించటం ఈ పరీక్షలో కీలకాంశం. ఊపిరితిత్తుల్లో అధిక రక్తపోటు గలవారిలో కణ రహిత డీఎన్‌ఏ పోచల మోతాదులు పెరుగుతాయి. జబ్బు తీవ్రమైనకొద్దీ ఇవీ ఎక్కువ అవుతాయి. అందువల్ల కొత్త రక్త పరీక్ష ఈ జబ్బు తీవ్రతను గుర్తించటానికి తేలికైన మార్గంగా ఉపయోగపడగలదని భావిస్తున్నారు.

పల్మనరీ హైపర్‌టెన్షన్‌ మూలంగా ఊపిరితిత్తుల్లో సూక్ష్మ రక్తనాళాల లోపలి మార్గం క్రమంగా కుంచించుకుపోతుంది. అడ్డంకులు ఏర్పడతాయి. దీంతో గుండె కుడివైపు భాగం మీద ఎక్కువ భారం పడుతుంది. గుండె విఫలమై కొన్నిసార్లు ప్రాణంతకం కూడా అవుతుంది. ప్రస్తుతం ఊపిరితిత్తుల్లో అధిక రక్తపోటు తీవ్రతను అంచనా వేయటానికి లక్షణాల ఆధారిత స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇది అన్నిసార్లూ కచ్చితంగా తీవ్రతను తెలియజేయలేకపోవచ్చు. ఊపిరితిత్తుల్లోకి గొట్టాన్ని పంపించి రక్తపోటును కొలుస్తుంటారు కూడా. దీని కోసం కోత పెట్టాల్సి ఉంటుంది. కొత్త పరీక్ష అందుబాటులోకి వస్తే ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయని, కచ్చితంగా జబ్బు తీవ్రతను తెలుసుకునే వీలుంటుందని నిపుణులు ఆశిస్తున్నారు.

అధునాతన కణ రహిత డీఎన్‌ఏ పరీక్ష పద్ధతి ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతోంది. అవయవ మార్పిడి చేయించుకున్నవారిలో శరీరం వాటిని తిరస్కరించే అవకాశాన్ని తొలిదశలోనే గుర్తించటానికి ఈ పరీక్ష వాడుతుంటారు. మున్ముందు ఇది చాలా అవసరాలకు ఉపయోగపడగలదని వైద్యులు భావిస్తున్నారు.

మొత్తానికి టెక్నాలజీ సాయంతో రోగాలను కనిపెట్టే విధానమే మారిపోతుంది. ఈ రోజుల్లో కొత్త రోగాలు ఎలా వస్తున్నాయో.. వాటిని కనిపెట్టేందుకు పరీక్షా విధానాలు కూడా అంతే వేగంగా వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news