నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని ఔషధ గుణాలు అనేక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. అనేక ఇతర ఆరోగ్య సమస్యలను త్వరగా తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి చాలా మంది రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం వేసుకుని తాగుతుంటారు. ఈ లెమన్ వాటర్ శరీరంలోని నీటి కొరతను కూడా తొలగిస్తుంది. నిమ్మకాయలో విటమిన్-సి, విటమిన్ బి6, విటమిన్ ఎ, విటమిన్-ఇ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదే కానీ అతిగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
నిమ్మకాయ నీటిని డిటాక్స్ డ్రింక్ అంటారు. ఇది బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. కానీ నిమ్మకాయ నీటిలో ఎక్కువ మొత్తంలో యాసిడ్ ఉంటుంది. అందుకే ప్రతిరోజూ నిమ్మరసం తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే..
శరీరంలో నీరు లేకపోవడం
నిమ్మరసం శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. కానీ మీరు దీన్ని క్రమం తప్పకుండా అవసరానికి మించి తీసుకుంటే, అది శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల తరచుగా మూత్రవిసర్జన వస్తుంది. దీంతో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది.
జీర్ణ సమస్యలు
చాలా మంది నిమ్మరసం తాగితే ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని నమ్ముతారు. కానీ నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల వికారం మరియు కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
హార్ట్ బర్న్
నిమ్మరసం అవసరానికి మించి తాగడం వల్ల గుండెల్లో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇప్పటికే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉన్నవారు నిమ్మరసం తాగకూడదు.
దంతాలకు హానికరం
నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది అనేక దంత సమస్యలను కలిగిస్తుంది. నిమ్మరసంలో ఆమ్ల గుణాలు పుష్కలంగా ఉంటాయి, ఇది దంతాలను దెబ్బతీస్తుంది.
స్కిన్ ఇరిటేషన్
చాలా మంది తమ చర్మ సంరక్షణలో భాగంగా నిమ్మకాయను చేర్చుకోవడానికి ఇష్టపడతారు. కానీ నిమ్మకాయను నేరుగా చర్మంపై అప్లై చేయడం వల్ల స్కిన్ ఇరిటేషన్ వస్తుంది. కాబట్టి దీన్ని నేరుగా చర్మంపై అప్లై చేసే ముందు నిమ్మరసాన్ని నీళ్లలో మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. ఆ తర్వాత ఎండలో వెళ్లడం మానుకోండి.