కరోనా కారణంగా పెరుగుతున్న జీర్ణ సమస్యలు.. కారణమేంటంటే,

కరోనా కారణంగా జరుగుతున్న విపరీతాలు అన్నీ ఇన్నీ కావు. సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉంది. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉండడంతో అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా జీర్ణాశయ సంబంధ సమస్యలైన గ్యాస్, బ్లోటింగ్, అసిడిటీ బారిన పడ్డవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. దీనికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా కరోనా నుండి రికవరీ అయిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

కరోనా వచ్చిన తర్వాత దానిపై పోరాడడానికి యాంటివైరల్, యాంటీ మలేరియల్, యాంటీ ఫంగల్, స్టెరాయిడ్లు ఇస్తుంటారు. ఇవి జీర్ణాశయం మీద ప్రభావం చూపి అసిడిటీ, బ్లోటింగ్, గ్యాస్ సమస్యలు పెరగడానికి కారణం అవుతున్నాయి. అదలా ఉంటే బయటకి వెళ్ళే అవకాశం లేకపోవడంతో ఇంట్లోనే ఉండి ఏం చేయాలో అర్థం కాక, చాలామంది ఆన్ లైన్లో వంటల కార్యక్రమాలు ఎక్కువగా చూస్తున్నారు. రొటీన్ నుండి భిన్నంగా ఉండడానికి వంటలు వండుతున్నారు.

అలా చేస్తున్న వెరైటీలు తింటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల రొటీన్ లేకుండా పోయింది. సమయానికి తినడం అనే అలవాటు పూర్తిగా పోయింది. బయటకి వెళ్ళేది లేదు కాబట్టి ఇంతకుముందు కంటే ఎక్కువ తింటున్నారు. అదీగాక ఫుడ్ డెలివరీ ఎక్కువ అవుతుంది. దాన్లోని మసాలాల కారణంగా కూడా ఈ ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. ఈ జీర్ణాశయ ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే సరైన సమయానికి ఆహారం తీసుకుని, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుండాలి. ఆరోగ్యకరమైన ఆహారాలు అనగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలని తీసుకుంటే ఈ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.