ఫిట్‌నెస్ మీద అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇద్దరకీ శ్రద్ద ఉంటుంది. నాజుగ్గా ఉండాలని అమ్మాయిలు అనుకుంటారు, మంచి కండలు పెంచి హ్యాండ్‌సమ్‌గా కనిపించాలని అబ్బాయిులు అనుకుంటారు. అనుకోడానికి ఏముందిలే.. ఎన్నైనా అనుకోవచ్చు. కానీ కార్యచరణలో పెడితేనే కదా..రిజల్ట్ ఉండేది. ఆరోగ్యంగా ఉండాలంటే డైలీ నడిస్తే చాలు అని అందరూ అంటారు. కేవలం రోజూ ఉదయం, సాయంత్రం నడిచి ఓ పోలీస్ ఆఫీసర్ తొమ్మిది నెలల్లో 48 కేజీల బరువు తగ్గాడు. నడవాలి నడవాలి అని అందరూ అంటారు కానీ.. అసలు రోజుకు ఎంత నడవాలి, ఎన్ని కిలోమీటర్లు నడవాలి ఇవి మీకు తెలుసా..? ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని వేల అడుగులు వేయాలో తెలుసా..?
ఫిట్‌గా ఉండేందుకు పెద్దలు అయితే ప్రతిరోజు దాదాపు 10000 అడుగులు నడవాలి. ఈ దూరం సుమారు 8 కిలోమీటర్లు అవుతుంది. మీరు మీ సామర్థ్యాన్ని బట్టి ఈ దూరాన్ని మరింత పెంచుకోవచ్చు కూడా. నడక అనేది ఒక రకమైన వ్యాయామం, ఇది మీ శారీరక దృఢత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు, చాలా మందికి ఇది బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు..
ప్రతిరోజూ నడక కండరాలను బలపరుస్తుంది.
రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
వృద్ధులలో కీళ్ల దృఢత్వం, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి మరియు జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి ప్రమాదాలు తగ్గుతాయి.
2020 సంవత్సరం నుండి జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, రోజుకు 8,000 అడుగులు వాకింగ్ చేసేవాళ్లు 4,000 అడుగులు వేసిన వారి కంటే ఏ కారణం చేతనైనా చనిపోయే ప్రమాదం 51శాతం తక్కువగా ఉందట.. రోజుకు 12,000 అడుగులు నడిచేవారిలో ప్రమాదం ఇంకా తక్కువగా ఉందని తేలింది..
ఇలా చేస్తే ఇంకా మంచిది..
చదునైన ఉపరితలంపై నడవడం కంటే ఎత్తులో ఎక్కడం వల్ల కండరాలు 3 రెట్లు ఎక్కువ ప్రయోజనం పొందుతాయని నివేదికల్లో చెప్తున్నారు. మీకు దగ్గర్లో కొండ ప్రాంతం ఉంటే..ఎక్కిదిగడం అలవాటుగా చేసుకోవచ్చు. లేదంటే..మెట్లు ఎక్కినా అంతే ప్రయోజనం ఉంటుంది. అయితే వృద్దులు ఇలా చేయడం కష్టం.. మిగతావారు హ్యాపీగా చేసేయొచ్చు.!
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.