మీకు హై బీపీ ఉందా.. అయితే కిడ్నీలు జాగ్రత్త సుమా..?

-

మన శరీరం రోజులో రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటుంది. అందులో చాలా రకాల రసాయనాలు కూడా ఉంటాయి. అయితే మన శరీరంలో రసాయనాలు ఎక్కువైనా.. తక్కువైనా ప్రమాదమే. అందుకే వాటిని నియంత్రించేందుకు ఓ వ్యవస్థ ఉంది. అదే మూత్రపిండాలు. కిడ్నీలు మన శరీరంలోని మలినాలను బయటకు పంపించి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

 

మనలో చాలా మందికి కిడ్నీ సమస్యలుంటాయి. చదువుకునే పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఏదో రకమైన కిడ్నీ సమస్య ఉంటుంది. అందులో ముఖ్యమైంది కిడ్నీలో రాళ్ల సమస్య. ఇది మొదటి దశలో నీళ్లు ఎక్కువగా తాగితే పోతుంది. అయినా తగ్గకపోతే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాల్సిందే.

 

అయితే దీర్ఘకాలంగా హై బీపీతో బాధపడేవారిలో కిడ్నీలు దెబ్బతినే ముప్పు ఎక్కువ ఉంటుదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే చివరికి కిడ్నీ వైఫల్యమూ సంభవించొచ్చట. ఇంతకీ అధిక రక్తపోటుతో కిడ్నీలు ఎలా దెబ్బతింటాయి? రహస్యమంతా ధమనులు, కిడ్నీల్లోని సూక్ష్మ రక్తనాళాల గోడలు మందం కావటంలోనే ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఈ విషయంలో కిడ్నీల్లోని రెనిన్‌ కణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి రెనిన్‌ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఈ హార్మోన్‌ రక్తపోటు నియంత్రణలో ఉండటానికి తోడ్పడుతుంది. కానీ రెనిన్‌ కణాల్లో హానికర మార్పులు సంభవించినప్పుడు ఇవి కిడ్నీల్లోని రక్తనాళాల గోడల్లోకి చొచ్చుకుపోతాయి. అప్పుడవి మృదు కండర కణాలనే మరో రకం కణాలు పోగయ్యేలా ప్రేరేపిస్తాయి. దీంతో రక్తనాళాల గోడలు మందమవుతాయి, గట్టిపడతాయి. ఫలితంగా రక్తనాళాలకు సాగే గుణం తగ్గుతుంది.

కిడ్నీలకు రక్త ప్రవాహం అస్తవ్యస్తమవుతుంది, రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ దెబ్బతింటుంది. కాబట్టి రక్తపోటు నియంత్రణకు డాక్టర్లు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడుకోవాలి. అలాగే మంచి జీవనశైలిని అలవరచుకోవాలి. ముఖ్యంగా ఉప్పు వాడకం తగ్గించాలి. సిగరెట్లు కాల్చే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. మద్యం జోలికి అసలే వెళ్లకూడదు. ఒకవేళ అలవాటుంటే పరిమితం చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

ఒక మాదిరి వ్యాయామమైనా రక్తపోటు తగ్గటానికి తోడ్పడుతుంది. బరువు అదుపులో ఉంచుకోవాలి. కేవలం 5% బరువు తగ్గినా రక్తపోటు తగ్గుముఖం పట్టటం ఆరంభిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మేలు చేస్తాయి. రాత్రిపూట కంటి నిండా నిద్రపోవాలి.

అధిక రక్త పోటు సైతం కిడ్నీల వైఫల్యానికి దారితీస్తాయి. అందుకే ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి. అధిక రక్త పోటు ఉన్నవారు.. సగం చెంచా కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. కూరగాయలు, పప్పుల్లో తప్పితే మిగతా వాటిల్లో ఉప్పు వాడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఉదయం వాడే ఇడ్లీ, దోశ పిండిలో ఉప్పు మానేయాలి. మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ఒక్కోగ్రాము చొప్పున ఉప్పు మాత్రమే తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news