గోళ్లలో హానికరమైన బాక్టీరియా ఉంటుంది. ఇన్ఫెక్షన్ కి గురి చేసి రకరకాల వ్యాధులకి కారణమయ్యే హానికరమైన బాక్టీరియా గోళ్లలో పెరుగుతూ ఉంటుంది. మ్యానిక్యూర్ చేయించుకున్నట్లయితే గోళ్లలో ఎంత చెత్త ఉంటుందో తెలిసే ఉంటుంది. ఆ హానికరమైన బాక్టోరియా చర్మానికి పగుళ్ళు ఏర్పడడం ద్వారానో, చేతులని ముఖానికి దగ్గరగా నోట్లో వేళ్ళని పెట్టుకోవడం వల్లనో, గోళ్ళు కొరకడం వల్లనో శరీరంలోకి ప్రవేశిస్తుంది. గోళ్ళు కొరకడం వల్ల వచ్చే నష్టాలేమిటో, వాటి నుండి బయటపడే మార్గాలేమిటో చూద్దాం.
జలుబుకి కారణమయ్యే 200రకాల వైరస్ లలో కొన్ని గోళ్ళలో ఉండే చెత్తలోనే ఉంటాయి. గోళ్ళు కొరికే అలవాటున్న వారికి జలుబు తరచుగా అవుతుందని అంటున్నారు. రోగనిరోధక శక్తి తగ్గించడంతో ఈ బాక్టీరియా చెడు చేస్తుంది. ఇలాంటి ఇబ్బందులు ఏర్పడకూడదంటే గోళ్ళు కొరకవద్దు. అది మానాలంటే, గోళ్ళకి నెయిల్ పాలిష్ వేస్తే బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ వాసన వచ్చే నెయిల్ పాలిష్ ని వాడితే గోళ్ళని నోట్లో పెట్టుకున్నప్పుడల్లా గోళ్ళు కొరకకూడదని గుర్తుకు వస్తుంది. అదీ గాక ఎప్పటికప్పుడు చేతులని శుభ్రపర్చుకుంటూ ఉండాలి. ఈ మహమారి టైమ్ లోనే కాకుండా సాధారణ సమయంలోనూ గోళ్ళని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఎక్కువ పెరగనీయకుండా చూసుకోవాలి.
దంత సమస్యలు
గోళ్ళు కొరకడం వల్ల ముందరి పళ్ళూ, చిగుళ్ళు దెబ్బతింటాయి. చిగుళ్ళలో నొప్పి, వాపు రావడానికి గోళ్ళు కొరకడం ప్రధానమైన సమస్య. మీ డెంటిస్ట్ ని కనుక్కుని గోళ్ళు కొరక్కుండా మౌత్ గార్డ్ వాడండి. ముందరి పళ్ళనుండి మొదలైన వాపు మెల్లమెల్లగా వ్యాపించుతూ నోరంతా ఇబ్బంది పెడుతుంటుంది. అందుకే గోళ్ళు కొరకడం మానేయాలి.